NTR Bharosa: నేడు ఏపీలో పెన్షన్ల పండుగ, పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించనున్న చంద్రబాబు
NTR Bharosa: ఏపీలో నేడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పెన్షన్ల ఇంటి వద్దే అందిస్తారు. పెనుమాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ అందిస్తారు.
NTR Bharosa: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు అంగన్‌వాడీల ద్వాారా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించనున్నారు ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో ఉన్న పెనుమాక గ్రామంలో చంద్రబాబు నాయుడు స్వయంగా పెన్షన్ అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పెన్షన్ అర్హులకు అందించనుంది. వృద్ధులు, వితంతు వులు, ఒంటరి మహిళలు , దీర్ఘకాలిక రోగులు, డయాలిసిస్ సమస్యతో బాధపడుతున్న వారికి పెంచిన పెన్షన్లు చెల్లిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చేపడుతున్న మొదటి భారీ సంక్షేమ కార్యక్రమం ఇదే.
ప్రభుత్వం ఏర్పాటైన మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తున్నారు. జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారులకు పింఛను ఇవ్వనున్నారు. మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛను అందచేస్తారు.
పింఛను పెంచడంతో పాటు గడిచిన మూడు నెలలకు కూడా పింఛను పెంపును వర్తింపచేసి లబ్దిదారులకు అందిస్తారు. పెరిగిన పింఛను రూ.4000, గత మూడు నెలల సొమ్ము రూ.3000 కలిపి రూ.7000 ఇవ్వనున్నారు.
వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇకపై రూ.4000 పింఛను చెల్లిస్తారు.
దివ్యాంగులకు రూ.3000 నుంచి ఒకేసారి రూ.6000 చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15000 చేశారు.ఈ విభాగంలో పింఛను పొందే వారి సంఖ్య 24318 మంది ఉన్నారు.
పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు ఖర్చు కానుంది. పింఛన్ల కోసం రూ.4,408 కోట్లు నేడు పంపిణీ చేస్తున్నారు. గడిచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు ఖర్చు కానుంది.
గత ప్రభుత్వంలో పింఛను కోసం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం మరో రూ.819 అదనంగా కోట్లు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏడాదికి ఇకపై పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పించన్లు పంపిణీ చేస్తారు. కొన్నిచోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బందిని కూడా పంపిణీకి వినియోగించనున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛను అందుకోలేని వారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందిస్తారు. మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 4408 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది.
సంబంధిత కథనం