Pavan Residence: పవన్ అధికారిక నివాసం అక్కడేనా, ఆ ఇద్దరికి అచ్చిరాని ఇల్లు అదే..!
Pavan Residence: ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న పవన్ కళ్యాణ్ అధికారిక నివాసంగా ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌ను ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Pavan Residence: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న పవన్ కళ్యాణ్ అధికారిక నివాసంగా ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌ను ఖరారు చేశారు. విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఆ ఇంట్లో గతంలో ఇద్దరు మంత్రులు నివాసం ఉన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో ఇరిగేషన్ ఎస్ఇ కార్యాలయం ప్రాంగణంలో పులిచింతల ప్రాజెక్ట్ ఆఫీసు కోసం నిర్మించిన భవనాలను అప్పటి జలవనరుల శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. అందులోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ప్రారంభోత్సవం కూడా చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున విశాలమైన స్థలంలో ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో జి ప్లస్ 2 భవనాలను నిర్మించారు. రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లలో పాలన హైదరాబాద్ నుంచి నిర్వహించడం ఇబ్బందికరంగా మారడంతో ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయం అవసరమైంది.
ఎన్నో భవనాలను పరిశీలించిన తర్వాత చివరకు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా నివాసం ఉంటున్న క్యాంపు కార్యాలయాన్ని సిఎం క్యాంపు కార్యాలయంగా ఎంపిక చేశారు. దీంతో అప్పటికప్పుడు దానికి అవసరమైన సదుపాయాలు, అదనపు హంగులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి సిఎం చంద్రబాబు ఉండవల్లికి మకాం మార్చారు. ఈ క్రమంలో దేవినేని ఉమా ఇరిగేషన్ కార్యాలయంలోనే మరోవైపు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2014-15 మధ్య కాలంలో ఇరిగేషన్ మంత్రి నివాసంతో పాటు క్యాంపు కార్యాలయం కోసం విశాలమైన నివాసాలను చేపట్టారు. ఆ పక్కనే ఇరిగేషన్ కార్యాలయం కోసం భారీ భవనాన్ని నిర్మించారు.
2015లో అమరావతి రాజధాని శంకుస్థాపన చేపట్టి 2016లో ప్రారంభించిన తర్వాత విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి చంద్రబాబు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంత కాలం దానిని ఏపీ హైకోర్టుగా వినియోగించారు. కొన్ని నెలల పాటు ఏపీ హైకోర్టు ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో నడిచింది. రాయపూడిలో హైకోర్టు భవనాలు ప్రారంభమయ్యాక అది అక్కడకు తరలిపోయింది. ఆ తర్వాత దానిని గవర్నర్ నివాసం కోసం ఎంపిక చేశారు. దేవినేని ఉమాతో మొదలై సిఎం క్యాంప్ ఆఫీసుగా చివరకు రాజ్‌భవన్‌గా స్థిరపడింది.
రాజ్‌భవన్ వెనుక మంత్రి దేవినేని ఉమా ముచ్చటపడి నిర్మించుకున్న గెస్ట్‌హౌస్‌ను 2019లో ఓడిపోవడంతో ఖాళీ చేయాల్సి వచ్చింది. జలవనరుల శాఖ భవనాలైనా అందులో ఉన్న హంగు ఆర్భాటాలు, విశాలమైన కాన్ఫరెన్స్ హాల్స్, ఇతర సదుపాయాలతో వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారయణ కన్ను దానిపై పడింది. జలవనరుల శాఖ బాధ్యతను అనిల్‌కు అప్పగించినా ఆ శాఖ భవనాన్ని మాత్రం బొత్స చేజిక్కుంచుకున్నారు. ఆయన శాఖలు మారినా చివరి వరకు అందులోనే ఉన్నారు.
ఇద్దరిక అచ్చిరాని ఇల్లు…
జలవనరుల శాఖ మంత్రిగా, టీడీపీలో సీనియర్ నాయకుడిగా, చిన్న చంద్రబాబుగా ఐదేళ్ల పాటు పెత్తనం చెలాయించిన దేవినేని ఉమా 2019లో ఓడిపోయారు. 2024లో ఆయనకు పోటీ చేసే అవకాశం కూడా దక్కలేదు. 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ 2024లో ఓడిపోయారు. వైసీపీలో కీలక మంత్రిగా ఏ అధికారిక ప్రకటన చేయాలన్నా ఆయనే దిక్కన్నట్టు సాగింది. ఇద్దరు మంత్రులకు ఘోర పరాజయాలు చవి చూసిన ఇంటిని ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌కు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది.
అధికారిక నివాసం అక్కడేనా, అచ్చిరాని ఇల్లుగా ముద్ర…
విజయవాడ నగరం మధ్యలో కోర్టు కాంప్లెక్స్‌కు రాజ్‌భవన్‌కు మధ్యలో ఉండే ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో గతంలో నివాసం ఉన్న ఇద్దరు మంత్రులకు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు అదే ఇంట్లో ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చే కార్యకర్తలు, నాయకులతో సమావేశాలకు వీలుగా ఉండటంతో దానిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా బుధవారం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు.