Dy CM Pawan: 250మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు అనుసంధానం చేయాలన్న పవన్ కళ్యాణ్‌, రూ.4976కోట్లతో ప్రణాళిక-pawan kalyans plan to connect every village with a population of 250 people with rs 4976 crores ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Dy Cm Pawan: 250మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు అనుసంధానం చేయాలన్న పవన్ కళ్యాణ్‌, రూ.4976కోట్లతో ప్రణాళిక

Dy CM Pawan: 250మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు అనుసంధానం చేయాలన్న పవన్ కళ్యాణ్‌, రూ.4976కోట్లతో ప్రణాళిక

Sarath chandra.B HT Telugu
Jul 12, 2024 04:45 AM IST

Dy CM Pawan: ఆంధ్రప్రదేశ్‌లో 250మందికి మించి జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్డు అనుసంధానం కల్పించాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ అధికారులకు సూచించారు. రూ.4976కోట్లతో ఏపీలో 7213 కి.మీ రోడ్లకు మహర్దశ కల్పించనున్నారు.

ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించిన పవన్ కళ్యాణ్
ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించిన పవన్ కళ్యాణ్

Dy CM Pawan: ఏపీలో గ్రామీణ రహదారులకు మహర్దశ కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతానని చెప్పారు.

yearly horoscope entry point

ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని పవన్ కళ్యాణ్ చెప్పారు.

రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతోపాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయనే విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలన్నారు.

గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఎ.ఐ.ఐ.బి.) అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమీక్షలో ఎ.ఐ.ఐ.బి అధికారులు ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్డు ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్‌కు అధికారులు వివరించారు. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని పవన్ అధికారులకు సూచించారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మొదలైన ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని అధికారులు పవన్‌ కళ్యాణ్‌కు వివరించారు. నెలకు రూ.200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి ఉంటుందని తెలిపారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంటు సమకూరిస్తే బ్యాంకు రూ.125 కోట్ల రుణం మంజూరు చేస్తుందని అధికారులు వివరించారు.

• గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం

“గత ప్రభుత్వం హయాంలో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడింది. ఆ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవన్నారు. తద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యపడేదని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యత మేం తీసుకుంటామన్నారు.

పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలని ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్ లో ప్రత్యేక కాలమ్ పొందుపర్చాలన్నారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరతామనన్నారు.

Whats_app_banner