Pawan Varahi Yatra : వాళ్ల కొమ్ములు విరగ్గొడతాం... వచ్చేది తమ ప్రభుత్వమేనన్న పవన్
Janasena Varahi Yatra Kaikaluru : వైసీపీ సర్కార్ పై విమర్శల పర్వాన్ని మరోసారి కొనసాగించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం కైకలూరు నియోజకవర్గంలో ముదినేపల్లి వద్ద తలపెట్టిన వారాహి విజయ యాత్ర సభలో ఆయన ప్రసంగించారు.
Janasena Varahi Yatra Kaikaluru : వైసీపీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం కైకలూరు నియోజకవర్గంలో తలపెట్టిన వారాహి విజయయాత్రలో సభలో పవన్ ప్రసంగించారు. అందరి జీవితాలను తమ అదుపులో పెట్టుకోవాలని వైసీపీ సర్కార్ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక కైకలూరు ఎమ్మెల్యే, ఆయన కొడుకు పోలీస్ స్టేషన్ వేదికగా పంచాయితీలు చేస్తున్నారని… కచ్చితంగా వాళ్ల కొమ్ములు విరగ్గొడతామని హెచ్చరించారు పవన్.
“సీఎం జగన్… మీ నాన్న వైఎస్ఆర్ పైనే పోరాటం చేశా. అలాంటిది నువ్వెంత..? రోడ్లు వేయమంటే వేయరు..? 80 కి.మీ రోడ్లు వేయలేరా..?రోడ్లు వేయలేని ముఖ్యమంత్రికి ఓట్లు వేయాలా..? ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ వాటిని పట్టించుకోకుండా… దౌర్జన్యాలకు దిగుతారా..? చుట్టు కొల్లూరు ఉన్నప్పటికీ… కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని నాకు ఫిర్యాదులు వచ్చాయి. జనసేన- టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కైకలూరులోని నీటి సమస్యను తీరుస్తాం. ఆ బాధ్యత నాదే. మీ నీటి సమస్యను తీర్చే జనసేన తీసుకుంటుంది. రేపు మేము అధికారంలోకి వచ్చాక మొత్తం కక్కిస్తా, ఇక్కడ కొల్లేరు అక్రమాలు బయటకు తీస్తా. కనీసం ఇంటర్ విద్యార్థులకు అక్టోబర్ వచ్చినా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. వెహికిల్ రిజిస్ట్రేషన్ చేస్తే RC ఇవ్వలేకుండా ఉంది. ఆస్తి పేపర్లు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి అంట, దోచేయడానికా..?ఆఖరికి మొన్న వినాయక చవితి లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బు తో ప్రజలు రోడ్డు వేసుకుంటాము అంటే, లేదు మేమే వేస్తాం అని అది కూడా చేయలేదు. రోడ్లు కూడా వేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఏపీలో ఉంది" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్.
8 వేలకు పైగా కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీ నిధులను జగన్ సర్కార్ పక్కదోవ పట్టించిందన్నారు పవన్. “వైసీపీ నేతలు సొంతంగా లక్ష రూపాయలు జేబులో నుంచి ఇచ్చారా..? క్లాస్ వార్ అనే హక్కు జగన్ కు లేదు. కానీ నేను నా సొంత డబ్బును కౌలు రైతులకు ఇచ్చి అండగా నిలిచాను. అడ్డగోలుగా నిధులను మళ్లించే నువ్వా… నాపై మాట్లాడేది..? గ్రామ పంచాయతీలకు నిధులు లేక సర్పంచ్ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు నన్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రస్తావించాలని కోరారు. మద్యం ధరలను పెంచారు. ఉదయం పథకం కింద డబ్బులు ఇచ్చి… సాయంత్రం మద్యం కింద లాగుకుంటున్నారు. ఆంధ్రాలోని మద్యం తాగి చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మద్యాన్ని నిషేధిస్తామని హామీనిచ్చిన వ్యక్తి… ఇలాంటి చర్యలకు దిగుతున్నాడు. ఇలాంటి విషయాలను ప్రజలు గమనించాలి.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మద్యం ధరలను తగిస్తాం. కల్తీ మద్యాన్ని పూర్తిగా లేకుండా చేస్తాం. మహిళలు వద్దని చెబితే.. అక్కడ మాత్రం మద్యం లేకుండా చేస్తాం. కైకలూరును మంచి పట్టణ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం” అని పవన్ చెప్పారు.
రాష్ట్రంలోని మొత్తం సీట్లు మీకు వస్తాయని చెబుతున్నారు… అలాంటప్పుడు టీడీపీ, జనసేనకు భయపడక్కర్లేదు కదా అని పవన్ ప్రశ్నించారు. NDA కూటమిలో జనసేన ఉంటే ఏంటి..? లేకపోతే మీకు ఏంటి? అని నిలదీశారు పవన్. తాము(టీడీపీ - జనసేన) అధికారంలోకి రాగానే కొల్లూరులోని అక్వా రైతాంగాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు పవన్. రాబోయే రోజుల్లో ఏపీలో ప్రభుత్వాన్ని స్థాపిస్తామని.. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.