Janasena Pawan Kalyan: వైసీపీ వలలో కాపులు చిక్కుకోవద్దన్న పవన్ కళ్యాణ్-pawan kalyan appealed to kapu elders not to get caught in ycps trap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Pawan Kalyan: వైసీపీ వలలో కాపులు చిక్కుకోవద్దన్న పవన్ కళ్యాణ్

Janasena Pawan Kalyan: వైసీపీ వలలో కాపులు చిక్కుకోవద్దన్న పవన్ కళ్యాణ్

Sarath chandra.B HT Telugu
Jan 05, 2024 07:18 AM IST

Janasena Pawan Kalyan: వైసీపీ కుట్రలు, కుయుక్తులతో పన్నిన వలలో కాపులు చిక్కుకోవద్దని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.

జనసేన అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్‌
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌

Janasena Pawan Kalyan: ఏపీలో వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని... అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని పవన్ కళ్యాణ్‌ ఆరోపించారు. తాను గౌరవించే కాపు పెద్దలు దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తానని చెప్పారు. ఎంత దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుంది

కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి... కాపులనే పావులుగా వాడుకొనే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారని చెప్పారు. అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను జనసేన బలంగా ఎదుర్కొంటోందని చెప్పారు.

ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని అదే రీతిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ప్రకటించి నేను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైసీపీకీ, ఆ పార్టీని నడిపే నాయకుడికీ కంటగింపుగా మారిందన్నారు.

జనసేనకు శాసన వ్యవస్థలో స్థానం లేకపోయినా ప్రజా జీవనంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలిచినందుకే ఎన్నో దాడులు.. దిగజారిన విమర్శలు చేస్తోందన్నారు. అసభ్యకర దూషణలకి దిగి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా తట్టుకొని నిలబడుతూనే ఉన్నామని పవన్ చెప్పారు.

కులాన్ని రెచ్చగొడుతున్న వైసీపీ….

అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్ధిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటం వైసీపీ కి జీర్ణం కావడం లేదన్నారు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోందని అందులో భాగంగా- తాను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి... పార్టీని బలహీనపరచే దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోందని ఆరోపించారు. కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడటానికి వారి కారణాలు వారికి ఉండవచ్చని వాటిని సహృదయంతో అర్థం చేసుకోగలనని చెప్పారు. వారి దూషణలను నేను దీవెనలుగా తీసుకొంటానని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సాధికారతతోపాటు, అగ్ర కులాల్లోని పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి దోహదపడాలన్నదే తన ఉద్దేశమన్నారు. కులాలను కలిపే ఆలోచనా విధానంతోనే అందరూ ఒక తాటిపైకి రాగలరని విశ్వసిస్తానని పవన్ వివరించారు.

తూర్పు కాపు, మత్స్యకార, శెట్టి బలిజ, గౌడ, కొప్పుల వెలమ, పద్మశాలి, దేవాంగ, విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, రజక, కాళింగ, వడ్డెర లాంటి బీసీ కులాలు, సంఖ్యాబలం లేని ఎంబీసీలు, మాల, మాదిగ, రెల్లి, ఎస్సీ ఉప కులాలు, ఎస్టీ కులాలను కలుపుకొని అడుగులు వేసే సమర్థత కాపులకు ఉంది కాబట్టే పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరానని చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారన్నారు. కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెర తీసిందని కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. జనసేనపై సామాజిక మాధ్యమాల్లో విషపు రాతలు రాయించడం, అపోహలు సృష్టించే తప్పుడు వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్ ఫోన్లకు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతోందని ఆరోపించారు.

కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ, తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలన్నారు. కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని నేను గౌరవించే కాపు పెద్దలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను దూషించే సదరు కాపు పెద్దలకు జనసేన పార్టీ వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని ప్రకటించారు.

Whats_app_banner