HT Telugu Effect : వరద బాధితుల న‌ష్ట‌ ప‌రిహారాన్ని రుణం కింద జ‌మ చేయవద్దు - బ్యాంకర్లకు కీలక ఆదేశాలు-ntr district collector issued orders not to deposit the compensation of flood victims under loan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ht Telugu Effect : వరద బాధితుల న‌ష్ట‌ ప‌రిహారాన్ని రుణం కింద జ‌మ చేయవద్దు - బ్యాంకర్లకు కీలక ఆదేశాలు

HT Telugu Effect : వరద బాధితుల న‌ష్ట‌ ప‌రిహారాన్ని రుణం కింద జ‌మ చేయవద్దు - బ్యాంకర్లకు కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 27, 2024 07:31 PM IST

వరద బాధితులకు ప్రభుత్వం అందించే సాయాన్ని రుణం కింద జమ చేసుకోవటంపై HT తెలుగులో కథనం పబ్లిష్ అయింది. ఇందుకు స్పందించిన ఎన్టీఆర్ జిల్లా అధికారులు… కీలక ఆదేశాలను జారీ చేశారు. బాధితుల న‌ష్ట‌ ప‌రిహారాన్ని రుణం కింద జ‌మచేయవద్దని స్పష్టం చేశారు. ఆటో డెబిట్ అయితే తిరిగి ల‌బ్ధిదారుడికి చెల్లించాలని ఆదేశించారు

వరద బాధితుల సాయంపై HT తెలుగు కథనం - స్పందించిన అధికారులు
వరద బాధితుల సాయంపై HT తెలుగు కథనం - స్పందించిన అధికారులు

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌దలు కార‌ణంగా ముంపున‌కు గురై చాలా మంది సర్వం కోల్పోయారు. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయాన్ని మంజూరు చేసింది. నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేసింది. అయితే పలువురి నిర్వాసితుల ఖాతాల్లో పడిన డబ్బులు… రుణం కింద డెబిట్ అయిపోయాయి. దీంతో వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై హిందుస్తాన్ టైమ్స్ తెలుగు సెప్టెంబర్ 27వ తేదీన ప్రత్యేక కథనాన్ని పబ్లిష్ చేసింది. దీనిపై ఎన్టీఆర్ జిల్లా అధికారులు స్పందించారు. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశామని జిల్లా కలెక్టర్ సృజన చెప్పారు. ఇలా జ‌మ‌చేసిన సొమ్మును ల‌బ్ధిదారునికి అప్ప‌టికే ఉన్న రుణం కింద ఎట్టిప‌రిస్థితుల్లోనూ జ‌మ‌ చేయొద్ద‌ని ఆదేశించారు. ఒక‌వేళ ఆటో డెబిట్ ద్వారా అడ్జెస్ట్ జ‌రిగి ఉంటే ల‌బ్ధిదారున్ని స్వ‌యంగా పిలిచి ఆర్థిక స‌హాయం మొత్తాన్ని న‌గ‌దు రూపంలో నేరుగా చెల్లించాల‌ని బ్యాంకు అధికారుల‌కు సూచించారు.

శుక్ర‌వారం ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో  క‌లెక్ట‌ర్ సృజ‌న 9వ జిల్లా సంప్ర‌దింపుల క‌మిటీ (డీసీసీ), జిల్లాస్థాయి స‌మీక్ష క‌మిటీ (డీఎల్ఆర్‌సీ) స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ… ఇటీవ‌ల వ‌ర‌ద‌ల కార‌ణంగా జిల్లాలో ముంపున‌కు గురైన బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించిందన్నారు. నేరుగా డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జ‌మ‌చేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. 

దాదాపు న‌ష్ట‌పోయిన 90 వేల కుటుంబాల‌తో పాటు వ్యాపార‌, వాణిజ్య ఆస్తి న‌ష్టాలకు సంబంధించి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ఆర్థిక స‌హాయాన్ని పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్ధిదారుల‌కు అందించేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌చేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. ల‌బ్ధిదారులు బ్యాంకుల నుంచి ఇప్ప‌టికే ఏవిధ‌మైన రుణాలునైనా తీసుకొని ఉంటే జ‌మ‌చేసిన ఆర్థిక స‌హాయాన్ని రుణం కింద జ‌మ‌చేసుకోవ‌ద్ద‌ని సూచించారు. స‌ర్వం కోల్పోయి ఎన్నో ఆర్థిక మాన‌సిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల‌ను మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపై ఉంద‌న్నారు. 

ఈ విష‌యంలో బ్యాంకుల భాగ‌స్వామ్యం అవ‌స‌ర‌మ‌న్నారు. జ‌మ‌చేసిన సొమ్ము ఆటోమేటిక్‌గా రుణ తిరిగి చెల్లింపు కింద క‌ట్ అయిన‌ట్లు గుర్తిస్తే ఆయా బ్యాంకు అధికారులు ల‌బ్ధిదారుల‌కు స‌మాచార‌మందించాలన్నారు. తిరిగి వారికి న‌గ‌దు రూపంలో ఆర్థిక స‌హ‌కారాన్ని అందించి వారు ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డంలో స‌హ‌క‌రించాలని క‌లెక్ట‌ర్ సృజ‌న బ్యాంకు అధికారుల‌కు సూచించారు. దీనిపై క‌లెక్ట‌ర్ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని త‌ప్ప‌నిస‌రిగా ఆర్థిక స‌హాయం బాధితుల‌కు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బ్యాంకర్లు చెప్పారు. ల‌బ్ధిదారుల‌కు స‌హ‌క‌రించ‌డంలో బ్యాంక‌ర్లు ముందుంటామ‌ని తెలిపారు. 

సమస్యలను పరిష్కరించండి - సీపీయం నేతలు

వరద బాధితుల సహాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీపీయం నేతలు కోరుతున్నారు. ఇదే విషయంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ… పేర్లు నమోదు కాక, బ్యాంక్ అకౌంట్లు సరిగా లేక బాధితుల అవస్థలు పడుతున్నారని చెప్పారు. సహాయం విడుదలలోనూ లోపాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఫిర్యాదులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సమీక్ష చేయాలని…  అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక సహాయం కూడా పెంచాలన్నారు.

శుక్రవారం విజయవాడ బుడమేరు వరద ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్, వడ్డెర కాలనీ, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాలలో బాబురావుతో పాటు మరికొంత మంది నేతలు పర్యటించారు. అనంతరం బ్యాంకు అధికారులను కలసి బాధితులు ఎదుర్కొంటున్న  సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.  25 వేల రూపాయలు మంజూరు కావాల్సి ఉండగా.. పదివేల రూపాయలు మాత్రమే మంజూరై మరికొందరు గందరగోళంలో ఉన్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వివిధ రుణాలు, పెనాల్టీల కింద కట్ చేసుకుంటున్నారని.. తగిన సమాచారం కూడా ఇవ్వటం లేదని ప్రస్తావించారు.

కార్లు, నాలుగు చక్రాల వాహనాలు, చిరు వ్యాపారులు, చిన్న, మధ్యతరగతి సంస్థలు, పరిశ్రమలు ఆర్దిక సహాయం విషయంపై ప్రభుత్వమ తగిన నిర్ణయాలు తీసుకోవాలని సీపీయం నేతలు కోరారు.  పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయినందున… కనీసం 50 వేలకు  తగ్గకుండా ప్రతి కుటుంబానికి సహాయం అందే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

NOTE: వరద బాధితుల పరిహారం విషయంపై హెచ్ టీ తెలుగులో పబ్లిష్ అయిన కథనం :  ప్రభుత్వ పరిహారం బ్యాంకుల పాలు, పాతబాకీల్లో జమ.. బాధితులకు తప్పని కడగండ్లు…