Airport Recruitment 2024 : విశాఖ, విజ‌య‌వాడ‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు - కేవ‌లం ఇంట‌ర్వ్యూనే..!-notification for filling jobs at vijayawada and visakhapatnam airports 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Airport Recruitment 2024 : విశాఖ, విజ‌య‌వాడ‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు - కేవ‌లం ఇంట‌ర్వ్యూనే..!

Airport Recruitment 2024 : విశాఖ, విజ‌య‌వాడ‌ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు - కేవ‌లం ఇంట‌ర్వ్యూనే..!

HT Telugu Desk HT Telugu
Nov 06, 2024 01:59 PM IST

విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం విమానాశ్రయాల్లో పలు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుదలయ్యాయి.కేవ‌లం ఇంట‌ర్వ్యూల ఆధారంగానే వీటిని భర్తీ చేయనున్నారు. న‌వంబ‌ర్ 11, 12 తేదీల్లో ఇంట‌ర్వ్యూలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.

విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌
విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యాల్లో కేంద్ర పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ఏ1 ఎయిర్‌పోర్ట్ స‌ర్వీసెస్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో జూనియ‌ర్ ఆఫీస‌ర్‌, ర్యాంప్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ క‌మ్ ర్యాంప్ డ్రైవ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదిక‌న ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నారు. న‌వంబ‌ర్ 11, 12 తేదీల్లో ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష‌ల లేకుండా కేవ‌లం ఇంట‌ర్వ్యూల‌తోనే భ‌ర్తీ చేస్తున్నారు.

పోస్టులు ఎన్ని?

మొత్తం 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌గా, జూనియ‌ర్ ఆఫీస‌ర్ (క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌) -4, ర్యాంప్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్‌-1, యుటిలిటీ ఏజెంట్ క‌మ్ ర్యాంప్ డ్రైవ‌ర్‌-8 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. విజ‌య‌వాడ ఎయిర్‌పోర్టులో ర్యాంప్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్ (1), యుటిలిటీ ఏజెంట్ క‌మ్ ర్యాంప్ డ్రైవ‌ర్ (8) పోస్టులు భ‌ర్తీ చేయ‌గా, విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్టులో జూనియ‌ర్ ఆఫీస‌ర్ (క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌) -4 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

జూనియ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు నెల‌కు వేత‌నం రూ.29,760, రాంప్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు నెల‌కు వేత‌నం రూ.24,960 , యుటిలిటీ ఏజెంట్ క‌మ్ ర్యాంప్ డ్రైవ‌ర్ పోస్టుల‌కు నెల‌కు వేత‌నం రూ.21,270 ఉంటుంది.

విద్యా అర్హ‌త‌లు…

1. జూనియ‌ర్ ఆఫీస‌ర్ (క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌) పోస్టుల‌కు ఏదైనా గుర్తింపు పొందిన ఉన్న‌త విద్యా సంస్థ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే టికెటింగ్‌, రిజ‌ర్వేష‌న్స్‌, కార్గో హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో తొమ్మిదేళ్ల అనుభ‌వం ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.

2. ర్యాంప్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఆటో మొబైల్ ఏదైనా ఒక విభాగంలో డిప్లొమా, లేదా ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

3. యుటిలిటీ ఏజెంట్ క‌మ్ డ్రైవ‌ర్ పోస్టుల‌కు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. వ్యాలిడ్ హెవీ మోట‌ర్ వెహిక‌ల్ లైసెన్స్ క‌లిగి ఉండాలి.

జూనియ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు గ‌రిష్టంగా 35 సంవ‌త్స‌రాలలోపు ఉండాలి. ర్యాంప్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ క‌మ్ డ్రైవ‌ర్ పోస్టుల‌కు గ‌రిష్టంగా 28 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు మూడేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలి?

అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు అప్లికేష‌న్‌ను అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.aiasl.in/resources/Recruitment%20Advertisement%20for%20Visakhapatnam%20&%20Vijayawada%20Airports.pdf నుండి డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేసి నేరుగా ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కావ‌చ్చు. అభ్య‌ర్థులు రూ.500 ఫీజును ఏ1 ఎయిర్‌పోర్టు స‌ర్వసెస్ లిమిటెడ్ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీసి ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో తీసుకొని వెళ్లాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగు అభ్య‌ర్థుల‌కు ఎటువంటి అప్లికేష‌న్ ఫీజు లేదు.

ఎంపిక ప్ర‌క్రియ‌

ఈ పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వ‌హించి ఎంపిక చేస్తారు. న‌వంబ‌ర్ 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఇంట‌ర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. జూనియ‌ర్ ఆఫీస‌ర్ (క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్‌) పోస్టుకు కేవ‌లం ఇంట‌ర్వ్యూ మాత్ర‌మే నిర్వ‌హిస్తారు. ర్యాంప్ స‌ర్వీస్ ఎగ్జిక్యూటివ్‌, యుటిలిటీ ఏజెంట్ క‌మ్ ర్యాంప్ డ్రైవ‌ర్ పోస్టుల‌కు ఇంటర్వ్యూతోపాటు ట్రేడ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. ఇంట‌ర్వూలు ఎన్‌టీఆర్ కాలేజీ ఆఫ్ వెటర్న‌రీ సైన్స్‌, విజ‌య‌వాడ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు ఎదురుగా, గ‌న్న‌వ‌రం, కృష్ణా జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-521101 చిరునామాలో జ‌రుగుతాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం