Flood Relief Protest: అందని వరద సాయం, ఆగని నిరసనలు.. సిఎంఓనే మభ్య పెడుతున్న ఐఏఎస్‌లు, బాధితుల ఆందోళన
Flood Relief Protest: విజయవాడలో బుడమేరు వదర పరిహారం అందక బాధితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ వేలాదిమందికి పరిహారం అందకపోవడంతో నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు అందరికి పరిహారం చెల్లించేసినట్టు కొందరు ఐఏఎస్ అధికారులు సిఎంఓను మభ్యపెట్టడమే సమస్యకు కారణంగా కనిపిస్తోంది.
Flood Relief Protest: అధికారుల నిర్లక్ష్యం బుడమేరు వరద బాధితుల పాలిట శాపంగా మారింది. ఆగస్టు 30, 31 తేదీల్లో కురిసిన ఆకస్మిక వర్షాలతో విజయవాడ నగరంలోని 32 డివిజన్లు వరద ముంపుకు గురయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీ తెల్లవారు జామున బుడమేరు కట్టలకు గండి పడటంతో నగరాన్ని వరద ముంచెత్తింది. వరదను అంచనా వేయడం నుంచి బాధితులకు పరిహారం అందించడం వరకు ఎన్టీఆర్ జిల్లా అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. వరదలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా సర్వం కోల్పోయిన బాధితులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
వరద ముంపుకు గురైన బాధితులకు ఉదారంగా సాయం చేయాలని ఏపీ సీఎం ఆదేశించినా దానిని అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. ముఖ్యమంత్రి వద్ద మంచి మార్కులు కొట్టేసే క్రమంలో కొందరు అధికారుల నిర్వాకంతో వరద నష్టం లెక్కింపులోనే గందరగోళం జరిగింది. వరద ముంపు పూర్తిగా తగ్గకుండానే ఎన్యూమరేషన్ చేపట్టడంతో పెద్ద సంఖ్యలో బాధితుల పేర్లు జాబితాల్లో చేరలేదు.
ఆ తర్వాత బాధితుల పేర్లను చేర్చడంలో సచివాలయాల నుంచి తాసీల్దార్ల వరకు ఉదాసీనంగా వ్యవహరించారు. మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న వారికి కూడా పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా ఇప్పటి వరకు వారికి పరిహారం దక్కలేదు. పదేపపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోయారు.
సాయం చేసినా దక్కని ఫలితం…
విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదలో బాధితులకు గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు. బాధితుల్లో చాలామంది సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగలడంతో వారిని ఆదుకునేలా పరిహారం ప్రకటించారు. అయితే బాధితులను గుర్తించడంలో మాత్రం రెవిన్యూ యంత్రాంగం దారుణంగా విఫలమైంది. వరద నష్టాన్ని అంచనా వేయడంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రప్పించిన 1700 బృందాలు హడావుడిగా, మొక్కుబడిగా సర్వే చేయడంతోనే ఈ సమస్య తలెత్తింది. సచివాలయాల స్థాయిలోనే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వారికి జాబితాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇప్పటికీ పరిహారం దక్కలేదు.
విజయవాడ నగరంలోని రెండు ఎమ్మార్వో కార్యాలయాల పరిధిలో వేల సంఖ్యలో బాధితులకు ఇప్పటికీ పరిహారం దక్కలేదు. దీనిపై గత కొన్ని రోజులుగా సీపీఎం ఆందోళన నిర్వహిస్తోంది. బాధితులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం, పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పు పడుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వరద నష్టంపై సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా విజయవాడ భవానీపురంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని బాధితులు ముట్టడించారు.
సిఎంఓను తప్పు దోవ పట్టిస్తున్న అధికారులు…
మరోవైపు వరద పరిహారం చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఐఏఎస్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో గుర్తించే ప్రయత్నాలు కూడా చేయకుండా రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలుగా నివేదికలు ఇస్తున్నారు. అంతిమంగా అది ప్రభుత్వ వైఫల్యంగా మారింది. విజయవాడ వరద బాధితులకు సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూలో అందరికి పరిహారం అందినట్టు ఎన్టీఆర్ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్, విఎంసి కమిషనర్ పేర్కొన్నారు.
వరదలు తగ్గిన 15 రోజుల్లో 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించామని, ఇప్పటి వరకు మొత్తం రూ.618 కోట్ల పరిహారం నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముందుగా రూ.602 కోట్లు బదిలీ చేశామని...తరువాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దాదాపు 9 వేల మందికి మరో రూ.16 కోట్లు చెల్లించామని అధికారులు తెలిపారు. తరువాత కూడా చాలా మంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారని..వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు. మళ్లీ కొత్తగా 2,954 దరఖాస్తులు రాగా....పరిశీలనలో 1,646 దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించామని.....మిగిలిన వాటిలో 1052 దరఖాస్తులు అర్హత లేనివిగా తేల్చామని చెప్పారు.
పరిహారం కోసం వచ్చే ప్రతి దరఖాస్తు పరిశీలించాలని అర్హులు ఉంటే తప్పకుండా సాయం అందేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. సచివాలయాల్లో లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ప్రదర్శించాలని సిఎం సూచించారు. ఒకవేళ ఎవరైనా పరిహారం పొందడానికి అనర్హులు అయితే...ఆ విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజెప్పాలని ఆదేశించారు. మొత్తం 2954 దరఖాస్తుదారుల వివరాలను సచివాలయంలో, వెబ్ సైట్ లో ఉంచాలని సిఎం ఆదేశించారు. వీరితో పాటు మొదటి ఫేజ్ లోపరిహారం పొందిన 4,19,528 మంది పేర్లు కూడా ఆయా సచివాలయాల్లో ప్రదర్శించాలని సిఎం సూచించారు. గత నెలన్నరగా లబ్దిదారుల వివరాలను అందుబాటులో ఉంచాలని సిఎం స్వయంగా ఆదేశించినా 179 సచివాలయాల్లో ఎక్కడా అది ఆచరణలోకి రాలేదు.