TTD : శ్రీవారి ప్రత్యేక దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు - టీటీడీ ప్రకటన
Tirumala Srivari Temple Updates : శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
Tirumala Tirupati Devasthanams Updates: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆ వార్తలు అవాస్తవం..
పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలును టీటీడీ సవరించినట్లు వస్తూన్న వార్తలు అవాస్తవమని తెలిపింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొరకు దళారులను సంప్రదించవద్దని కోరింది.
శనివారం కొన్ని వాట్సాప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చని, కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్కులేట్ అవుతుందని పేర్కొంది.
నిజానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగిందని టీటీడీ వివరించింది.
భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టిక్కెట్లను పొందే సౌకర్యం ఉందని క్లారిటీ ఇచ్చింది. టూరిజం ద్వారా రావాలి అనుకొనే భక్తులు, దళారీ ల ద్వారా కాకుండా నేరుగా టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని వివరించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.
కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తామని చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని టీటీడీ వెల్లడించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్ లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టిటిడి విజిలెన్స్ విభాగము కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశింది. ఇటువంటి దళారుల మాటి నమ్మి మోసపోవద్దని భక్తులను కోరింది.
వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.