Tirumala : భక్తులకు అలర్ట్... తిరుమల శ్రీవారి వాచీలు, మొబైల్ ఫోన్ల ఈ-వేలం - ఇలా దక్కించుకోవచ్చు-auction of watches and mobile phones of tirumala srivaru on june 24 at tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : భక్తులకు అలర్ట్... తిరుమల శ్రీవారి వాచీలు, మొబైల్ ఫోన్ల ఈ-వేలం - ఇలా దక్కించుకోవచ్చు

Tirumala : భక్తులకు అలర్ట్... తిరుమల శ్రీవారి వాచీలు, మొబైల్ ఫోన్ల ఈ-వేలం - ఇలా దక్కించుకోవచ్చు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 21, 2024 03:42 PM IST

Tirumala Srivari Temple Updates : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను ఈ-వేలం వేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

టీటీడీ ఈవేలం ప్రకటన
టీటీడీ ఈవేలం ప్రకటన

Tirumala Tirupati Devasthanams Updates: తిరుమల శ్రీవారికి సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్ల ఈ- వేలానికి సంబంధించి ప్రకటన జారీ అయింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించారు.

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు మరియు మొబైల్ ఫోన్లను జూన్ 24న ఈ - వేలం వేయనున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం ప్రక్రియ జరుగుతుందని టీటీడీ తెలిపింది.

ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, తదితర కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో, తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు వున్నాయి. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 14 లాట్లు, మొబైల్ ఫోన్లు 24 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నెంబర్ ద్వారా సంప్రదించాలని టీటీడీ సూచించింగది. లేదా టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org , రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొంది.

టీటీడీ మరో కీలక నిర్ణయం….

తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు.

శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరని తెలిపింది. కావున భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

నాణ్యతను మరింత మెరుగుపరచండి- టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్యామల రావు అధికారులను ఆదేశించారు.

తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌(ఎంటీవీఏసీ), విక్యూసీలోని అక్షయ కిచెన్‌, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం, ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

తిరుమల మరియు తిరుపతి లతో కలిపి రోజుకు సగటున తిరుమలలో 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తుండగా వీరిలో తిరుమల లో దాదాపు 1.75లక్షలు, తిరుపతిలో 17 వేలు, వారాంతాల్లో తిరుమలలో రమారమి 1.95 లక్షలు, తిరుపతిలో 19 వేలతో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు.

ఒక రోజున అన్నప్రసాదం కోసం అవుతున్న ఖర్చు దాదాపు రూ.38 లక్షలుగా ఉంది. ఈ సందర్భంగా కూరగాయల దాతలు, ఒకరోజు విరాళం పథకం తదితర అంశాలపై కూడా ఈఓ సమీక్షించారు. భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని అధికారులకు ఈఓ సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.

WhatsApp channel