Tirumala : కాలినడక భక్తులకు కీలక అలర్ట్ … ఇకపై అలా చేస్తేనే శ్రీవారి దర్శనం - టీటీడీ తాజా నిర్ణయం ఇదే
Tirumala Tirupati Devasthanam Updates :శ్రీవారి మెట్టు నడక మార్గంలో స్కాన్ చేసిన టోకెన్లు ఉంటేనే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్ స్కానింగ్‌ను టీటీడీ పునఃప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు.
శ్రీవారి మెట్టు వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుండి విధిగా 1200వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. లేకుంటే గతంలో ఆచరణలో ఉన్నట్లుగా దివ్య దర్శనం టోకెన్లు కలిగి స్కాన్ చేసుకోని భక్తులను దర్శన క్యూ లైన్లలో అనుమతించరని తెలిపింది. కావున భక్తులు ఈ మార్పును గమనించి తదనుగుణంగా దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
క్యూలైన్ల పరిశీలన….
టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులతో కలిసి గురువారం నారాయణగిరి షెడ్ల వద్ద వివిధ క్యూ లైన్లను పరిశీలించారు. ఇందులో భాగంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్లే సర్వ దర్శనం, స్లాటెడ్ సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులకు పలు సూచనలు చేశారు. నారాయణగిరి షెడ్లలోని క్యూలైన్ల పరిశీలనలో భాగంగా సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడంతో సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.
ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప…
తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు.
ఉదయం 6.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు.
ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కన్నులపండుగగా చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్పస్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు
మరోవైపు ఇటీవలే సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, వసతి టికెట్ల కోటా విడుదల సమాచారాన్ని టీటీడీ ప్రకటించింది. టీటీడీ యాప్, వెబ్ సైట్ లో సెప్టెంబర్ కోటా వివరాలను వెల్లడించింది.
- ఇవాళ ఉదయం (జూన్ 21) శ్రీవారి ఆర్జి సేవల టికెట్లు(కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకార సేవ) విడుదల అయ్యాయి.
- శ్రీవారి ఆర్జిక సేవ(వర్చువల్), కనెక్టడ్ దర్శనం కోటా టికెట్లు(కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకార సేవ) విడుదల - జూన్ 21, మధ్యాహ్నం 3 గంటలకు
- తిరుమల అంగ ప్రదక్షిణ టికెట్లు విడుదల- జూన్ 22, ఉదయం 11 గంటలకు
- వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లు - జూన్ 22, మధ్యాహ్నం 3 గంటలకు
- తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ.300) - జూన్ 24, ఉదయం 10 గంటలకు
- తిరుమల, తిరుపతి వసతి గృహాల టికెట్లు విడుదల - జూన్ 24, మధ్యాహ్నం 3 గంటలకు
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు(రూ.200) జులై కోటా -జూన్ 24, ఉదయం 10 గంటలకు
- టీటీడీ స్థానిక ఆలయాల్లో సేవల టికెట్లు (జులై కోటా)- జూన్ 25, ఉదయం 10 గంటలకు