Vizag Steel: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్ర బాబు మద్దతు? కాదనలేరు, ఖండించలేరు... రాష్ట్రంలో నయా రాజకీయం
Vizag Steel: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణలో వేగం పెరిగిందంటూ జాతీయ దినపత్రికలో వచ్చిన కథనం కలకలం రేపింది. ప్రైవేటీకరణకు చంద్రబాబు మద్దతిస్తున్నారని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీని ఇరకాటంలో నెట్టేందుకే ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Vizag Steel: విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణలో వేగం పెరుగుతోందని, ప్రైవేటీకరణకు ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మద్దతిచ్చే అవకాశాలున్నాయంటూ ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం ప్రచురితమైన కథనం కలకలం రేపింది.
ఏపీ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ అంశం కొన్నేళ్లుగా రగులుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిమాండ్‌తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండటంతో దానిని ప్రైవేటీకరించాలని కేంద్రం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనిపై రాజకీయంగా ఏపీలో అన్ని పార్టీలు సంకట స్థితిని ఎదుర్కొంటున్నాయి.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు రాజకీయ పార్టీలకు కూడా ఉంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చంద్రబాబు నాయుడు మద్దతిచ్చే అవకాశం ఉందని, RINL అమ్మకాన్ని వేగం పెంచుతారని, 2021లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినప్పటి నుంచి పెట్టుబడుల ఉపసంహరణ అంశం పెండింగ్‌లో ఉందని, తాజాగా ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్రైవటీకరణ సులువవుతుందని ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వొచ్చని అందులో పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సారథ్యంలో ఉన్న ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో పెట్టుబడుల ఉపసంహరణపై ముందుకు వెళ్లే అవకాశాలుంటాయని టీడీపీ వర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువడింది. బీజేపీ ప్రణాళికకు తమ మద్దతు ఉంటుందని టీడీపీ నేతలు చెప్పినట్టు అందులో పేర్కొన్నారు. అభివృద్ధి, పెట్టుబడి నేపథ్యంలో.. పెట్టుబడుల ఉపసంహరణపై తమకేమి భిన్నమైన అభిప్రాయాలు లేవని చంద్రబాబు ఇటీవల అభిప్రాయపడ్డారని ఆ కథనంలో అభిప్రాయపడ్డారు.
ఏపీలో అప్పుడే మొదలైన నయా రాజకీయం…
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కొద్ది రోజుల క్రితం ఉక్కుశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అనూహ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు మద్దతు పేరుతో వచ్చిన కథనం కలకలం రేపింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ స్పందన తెలుసుకునేందుకు హిందుస్తాన్ టైమ్స్ ప్రయత్నించింది. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ వైఖరి తెలుసుకునేందుకు ప్రయత్నించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రైవేటీకరణ అంశంలో జరుగుతున్న ప్రచారం ఏపీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా తెలుస్తోంది. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో రాజకీయంగా టీడీపీని ఇరకాటంలో పెట్టి లబ్ది పొందినట్టే ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో ప్రజల్ని రెచ్చగొట్టి లాభపడే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు టీడీపీలో ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ఖండించినా, సమర్ధించినా దాని ద్వారా రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఇదంతా వ్యూహాత్మకంగా కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో భాగం కావొచ్చనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు మద్దతు వంటి కథనాలు నిరాధారమని, అలాంటి అభిప్రాయాలు, చర్చలు అధికారికంగా ఎక్కడా జరగలేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కుమారస్వామి….
ప్రైవేటీకరణ ముప్పు ముంగిట ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి బుధవారం వస్తున్నారు. ప్లాంట్ ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో గురువారం సమీక్ష నిర్వహిస్తారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే ప్రతిపాదనలపై స్పందిస్తారా లేదా అనేది కీలకంగా మారింది.
విశాఖ ఉక్కు కర్మాగారం ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంది. మూడేళ్లుగా ప్లాంటులో 60 శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. పెట్టుబడులు లేక ఫర్నేస్‌లను నిలిపివేయాల్సి వచ్చింది. 2022 నుంచి ఒక బ్లాస్ట్‌ఫర్నేస్-3 నిలవడంతో రెండున్నర మిలియన్ టన్నుల ఉత్పత్తి ఆగింది. విశాఖ ఉక్కులో భాగమైన రాయబరేలి ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంటును రూ.2వేల కోట్లకు అమ్మేశారు.
విశాఖలో విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. చెన్నై, హైదరాబాద్‌లోని ఉక్కు యార్డులతో పాటు, వివిధ నగరాల్లోని కార్యాలయ భవనాలను రూ.475 కోట్లకు అమ్మేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నగరం మధ్యలో 19వేల ఎకరాల భూములు ఉండటంతో అవి అందరిని ఊరిస్తున్నాయి.