Loan App Threats : యువతి ఫొటోలు మార్ఫింగ్, బంధువులకు పంపి వేధింపులు-నెల్లూరు జిల్లాలో లోన్ యాప్స్ ఆగడాలు
Loan App Threats : నెల్లూరు జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు మళ్లీ రెచ్చిపోయారు. ఓ యువతి ఫొటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఆమె కాంటాక్ట్స్ పంపించారు.
Loan App Threats : ఇటీవల కాస్త తగ్గిన లోప్ యాప్ నిర్వాహకుల ఆగడాలు మళ్లీ మొదలవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోయారు. ఓ యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు దిగారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను యువతి కాంటాక్ట్స్ కు పంపించి మానసికంగా వేధించారు. నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ యువతికి వారం రోజుల క్రితం రూ. 3 వేలు అవసరమై ఆన్లైన్ లో లోన్ యాప్ లను సెర్చ్ చేసి క్యాండీ క్యాష్, ఈజీ మనీ యాప్ లలో తన వివరాలు నమోదు చేసింది. ఈ రెండు లోన్ యాప్ ల నుంచి రూ.3,700 యువతి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. అయితే మూడు రోజుల తరువాత అప్పుగా తీసుకున్న అమౌంట్ ను యువతి తిరిగి లోన్ యాప్ లకు చెల్లించింది.
యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి
యువతి తీసుకున్న అమౌంట్ లోన్ యాప్ లకు చెల్లించినా... ఇంకా కట్టాలని లోన్ యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపు కాల్స్ మొదలయ్యాయి. తాము అడిగిన డబ్బు కట్టకపోతే తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పెడతామని, బంధువులకు పంపించి పరువు తీస్తామని యువతిని బెదిరించారు. శుక్రవారం యువతి ఫోన్ ను హ్యాక్ చేసిన యాప్ నిర్వహకులు... మార్ఫింగ్ చేసిన యువతి ఫొటోలను ఆమె కాంటాక్ట్ నెంబర్లకు పంపించారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక, మనోవేదనకు గురైన బాధిత యువతి చివరకు దిశ యాప్ లో SOSకు కాల్ చేసి సాయం కోరింది. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు లోన్ యాప్ నిర్వహకులపై కేసు నమోదు చేశారు. సైబర్ పోలీసులు కూడా లోన్ యాప్ నిర్వాహకుల వివరాలు సేకరిస్తున్నారు. లోన్ యాప్స్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా పోలీసులను సంప్రదించాలని యువతికి సూచించారు. లోన్ యాప్స్ లో వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
లోన్ యాప్ వేధింపులకు విద్యార్థి ఆత్మహత్య
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల లోన్ యాప్ వేధింపులతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇంజినీరింగ్ విద్యార్థి తేజష్ (22) లోన్ యాప్ ద్వారా రూ.46,000 అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బును క్రమం తప్పకుండా తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు దిగారు. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జాలహళ్లిలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తేజష్ ఏడాదిన్నరగా వివిధ లోన్ యాప్స్ వినియోగిస్తున్నట్లు అతడి తండ్రి తెలిపారు. ఇటీవలె తనకు ఈ విషయం తెలిసిందన్నారు. ఇటీవల కాలేజీ లేదని ఇంట్లోనే ఉన్న తేజష్... ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తేజష్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.