CBN in Kanigiri : ఈ వంద రోజులు శ్రమించండి.. టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించండి - చంద్రబాబు
Chandrababu Public Meeting at Kanigiri: ఏపీని జగన్ 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. శుక్రవారం కనిగిరిలో నిర్వహించిన సమర శంఖారావం సభలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Chandrababu Public Meeting at Kanigiri: శుక్రవారం కనిగిరిలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన సమర శంఖారావం బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏపీని మరో 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు. సైకోలకు భయపడే ప్రసక్తే లేదని…. రాష్ట్రంలో సైకో పోవాలి..సైకిల్ రావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పులివెందుల నుంచి వచ్చి చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారని ఆరోపించారు చంద్రబాబు. కనిగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో ఉన్నా ఇతర ప్రాంతాల వలస వెళ్లి స్థిరపడుతున్నారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వా కనిగిరి రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ నినాదమన్న ఆయన…. దేశంలో మొదటిసారి రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు.. ప్రజలకి జగన్ ఇప్పుడు 10రూపాయలు ఇచ్చి.. 100 దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
2019 లో ఒక్క ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు మోసపోయామని చెబుతున్నారని.. మరోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వొద్దని కోరారు. ఎన్నికల సమయంలో జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేళ్లలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే జగన్ గంజాయి ఇస్తున్నారని సీరియర్ కామెంట్స్ చేశారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని… రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే జరుగుతున్నాయని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఈ వంద రోజులు శ్రమించాలని కోరారు చంద్రబాబు.. తెలుగుదేశం, జనసేన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం మీరు ఒక్క అడుగు ముందుకేస్తే.. తాను వంద అడుగులు వేస్తానని చెప్పారు. తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు.
వంద రోజులు శ్రమించండి.. తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించండి. రాష్ట్రం కోసం మీరు ఒక్క అడుగు ముందుకేస్తే.. నేను వంద అడుగులు వేస్తా. తెలుగుజాతికి స్వర్ణయుగం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా. పేదవారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తా. ఓటమి భయంతో ఎమ్మెల్యేలను మారుస్తున్నారని చంద్రబాబు అన్నారు. పవన్, లోకేశ్ తో పాటు తనను తిట్టాలని ఎమ్మెల్యేలకు చెబుతున్నారని… అలాంటి వారికి టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేషారు. తిట్టనోళ్లకు టికెట్లు ఇవ్వటం లేదంట… ఇదేం రాజకీయం..? అంటూ ప్రశ్నించారు. తెదేపా- జనసేన ప్రభుత్వంలో మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు అన్నివర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు.