Minister Lokesh On YCP Offices : ఏపీ నీ జాగీరా..! ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి..? - జగన్ పై లోకేశ్ ఫైర్-minister nara lokesh fires on ys jagan over party office buildings ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Lokesh On Ycp Offices : ఏపీ నీ జాగీరా..! ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి..? - జగన్ పై లోకేశ్ ఫైర్

Minister Lokesh On YCP Offices : ఏపీ నీ జాగీరా..! ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి..? - జగన్ పై లోకేశ్ ఫైర్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 23, 2024 11:08 AM IST

Minister Nara Lokesh On Jagan : వైసీపీ అధినేత జగన్ పై మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ తాత జాగీరా..? ధనదాహానికి అంతులేదా? అని ప్రశ్నించారు.

జగన్ పై మంత్రి లోకేశ్ ఫైర్
జగన్ పై మంత్రి లోకేశ్ ఫైర్

Minister Nara Lokesh On Jagan : వైసీపీ పార్టీ ఆఫీసుల నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం సీఆర్డీఏ అధికారులు కూల్చేవేశారు. ఇదే కాకుండా విశాఖలో నిర్మిస్తున్న ఆఫీసుకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

yearly horoscope entry point

ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రభుత్వ బెదిరింపులు తలొగ్గేది లేదన్నారు. ఇదిలా ఉంటే… జగన్ ను టార్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.

ధనదాహానికి అంతులేదా…? మంత్రి లోకేశ్

జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత జాగీరా అని లోకేశ్ ప్రశ్నించారు. “ వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు.ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?” అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ పోస్టుకు కొన్ని ఫొటోలను జత చేశారు.

కూల్చివేత - మరోవైపు  నోటీసులు

తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసిన కొన్ని గంటల్లోనే వైజాగ్‌లోని పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు అందాయి. శనివారం తెల్లవారుజామునే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు.

విశాఖ జిల్లా యెండాడలో సర్వే నంబర్ 175/4లో అనుమతులు లేకుండా రెండెకరాల భూమిలో కార్యాలయం నిర్మించడంపై జీవీఎంసీ కార్పొరేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ ప్రాంతం జీవీఎంసీ పరిధిలోకి వస్తుందని, జీవీఎంసీకి బదులుగా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ)కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ విషయంపై వారం రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని జోన్-2 టౌన్ ప్లానింగ్ అధికారి వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు.దీంతో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన విశాఖ వైసీపీ కార్యాలయాన్ని కూడా కూల్చివేసే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నిర్మాణంలో ఉన్న కేంద్ర కార్యాలయ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ శనివారం తెల్లవారుజామున కూల్చివేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటన ద్వారా రాబోయే ఐదేళ్ల పాలన ఎలా ఉండబోతుందో కొత్త టీడీపీ ప్రభుత్వం హింసాత్మక సందేశాన్ని ఇచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగడం ద్వారా చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘తాడేపల్లిలో దాదాపుగా పూర్తయిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఓ నియంత కూల్చివేశాడు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగయ్యాయి..’ అని పేర్కొన్నారు.

తమ పార్టీ తలవంచదని, గట్టిగా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఈ బెదిరింపులు, ఈ హింసాత్మక చర్యలకు వైసీపీ లొంగదు, వెనక్కి తగ్గేది లేదు. ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజలతో కలిసి పోరాడతామన్నారు. చంద్రబాబు దుశ్చర్యలను దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరుతున్నాను' అని జగన్ పేర్కొన్నారు. 

జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు సీరియస్ అవుతున్నారు. ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా దోచుకున్నారని ఆరోపిస్తున్నారు. చీకటి జీవోలు ఇచ్చి…. పార్టీ కార్యాలయాలకు భూములను దోచుకున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ దోచుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.

Whats_app_banner