రాష్ట్ర మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా ఏడాది 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లరేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది ఉన్నారు. వీరికి ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే రూ.3640 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
'దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం అవుతుంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. కేబినెట్ భేటీలో పథకానికి ఆమోదం తెలుపుతాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తున్నాం. పారదర్శక పాలన అందిస్తాం' అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. జిల్లాల్లో ఎంతమంది లబ్దిదారులు ఉన్నారో, ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమో అధికారులు లెక్కలేస్తున్నారు. కూటమి పార్టీల ఎన్నికల హామీలు సూపర్ సిక్స్‌లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి. ఈ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకం కింద లబ్దిదారులకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఒక్కో సిలిండర్ ధర రూ.837గా ఉండగా.. ఏటా రూ.2,511 ఆదా ఆవుతుంది.
సీఎం చంద్రబాబు ప్రకటనతో.. పౌరసరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీపం, ఉజ్వల పథకం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు ఉన్న 75 లక్షల మందికే ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.1,763 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కకడుతున్నారు. ఏటా ఎంత వ్యయం అవుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పథకాల అమలుపై పౌరసరఫరాల శాఖ అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేస్తుంది. ఈ అంశంపై మంత్రుల కమిటీ భేటీ అయ్యి.. సీఎంకు పలు సిఫారసులు చేయనున్నారు.