Kadapa Petrol Attack Case : కడప విద్యార్థిని హత్యపై సీఎం చంద్రబాబు సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Kadapa Petrol Attack Case : కడప జిల్లా బద్వేలు సమీపంలో పెట్రోల్ దాడికి గురైన విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప విద్యార్థిని హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటన ఎంతగానో కలచివేసిందన్న సీఎం.. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. నేరస్థుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానని చంద్రబాబు వివరించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగింది..
మృతిచెందిన విద్యార్థిని (16) ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న విఘ్నేష్‌తో చిన్నప్పటి నుంచి ఆ విద్యార్థినికి స్నేహం ఉంది. విఘ్నేష్‌కు వివాహం కాగా.. భార్య గర్భిణి. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి ఫోన్ చేసి శనివారం తనను కలవాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
విఘ్నేష్ ఫోన్ చేసి అలా చెప్పడంతో.. విద్యార్థిని శనివారం కళాశాల నుంచి ఆటోలో బయలుదేరింది. విఘ్నేష్ మధ్యలో ఆ ఆటో ఎక్కాడు. బద్వేలుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీపీకుంట చెక్‌పోస్టు వద్ద ఇద్దరు దిగి సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి విఘ్నేష్.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. కొందరు మహిళలు ఆమెను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో బాధిత అమ్మాయిని హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక.. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు.
ఇదేం రాజ్యం..
ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం సీఎం చంద్రబాబు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణం అయ్యాయని వ్యాఖ్యానించారు. బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోలు పోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.