Mancherial Murders : పెట్రోల్‌తో ముగ్గురి కోసం స్కెచ్...ఆరు ప్రాణాల బలి..-mancherial murders case accused purchased five thousand rupees worth petrol in ccc bunk ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mancherial Murders : పెట్రోల్‌తో ముగ్గురి కోసం స్కెచ్...ఆరు ప్రాణాల బలి..

Mancherial Murders : పెట్రోల్‌తో ముగ్గురి కోసం స్కెచ్...ఆరు ప్రాణాల బలి..

HT Telugu Desk HT Telugu
Dec 19, 2022 09:40 AM IST

Mancherial Murders మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటనలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పద్మ, శాంతయ్యలను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో మిగిలిన వారు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. పక్కా ప్రణాళికతో నెలల తరబడి కాపుగాచి హత్యలకు పథక రచన చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులు హత్యలు జరిగిన గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

ఐదు వేల రుపాయల పెట్రోల్‌తో ఆరు హత్యలు
ఐదు వేల రుపాయల పెట్రోల్‌తో ఆరు హత్యలు (twitter)

Mancherial Murders మంచిర్యాల సజీవ దహనం కేసులో నిందితులు రూ.5వేల ఖరీదు చేసే పెట్రోల్‌ను సీసీసీ బంకులో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో పోలీసులకు లభించిన పెట్రోల్ క్యాన్ల ఆధారంగా ఘటన జరిగిన గ్రామానికి 8 కి.మీ. దూరంలో ఉన్న పెట్రోల్‌ బంక్‌లో ముగ్గురు వ్యక్తులు రూ.5 వేల పెట్రోల్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పెట్రోల్ కొనుగోలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లక్సెట్టి పేటకు చెందిన వ్యక్తితో పాటు ఉట్కూర్‌కు చెందిన మరో వ్యక్తితో పాటు, గోదావరి ఖనికి చెందిన ఐదుగురు, ఆటోలో వచ్చి హత్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన మరొకరికి నిందితులు డబ్బు ఎర వేయడంతో ఎప్పటికప్పుడు వారికి ఫోన్లో సమాచారం అందించినట్లు గుర్తించారు. ఈ కేసులో హతుడు శాంతయ్య కుటుంబ సభ్యులతో పాటు సజీవ దహనానికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు.

లక్సెట్టిపేట, ఉట్కూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఘటన జరగడానికి వారం రోజులు ముందు నుంచి ఓ లాడ్జిలో బస చేశారు. వెంకటపూర్‌ గ్రామంలో పలుమార్లు రెక్కీ నిర్వహించిన అనంతరం ఈ నెల 16న శ్రీరాంపూర్‌కు చెందిన ఆటో మాట్లాడుకున్నారు. నిందితులు ముందే సిద్ధం చేసుకున్న డబ్బాల్లో సీసీసీ బంక్‌లో రాత్రి 9.54 గంటలకు పెట్రోల్‌ కొనుగోలు చేశారు. ఈ దృశ్యాలు సీసీ టీవీలలో రికార్డ్ అయ్యాయి.

గుడిపెల్లికి చెందిన వ్యక్తి నిందితులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ వచ్చాడు. అతను ఇచ్చిన సమాచారంతో సీసీసీ పెట్రోల్ బంకు నుంచి నేరుగా గ్రామానికి రాకుండా వేరే మార్గంలో 15 కి.మీలు అదనంగా ప్రయాణించారు. రసూల్‌పెల్లి మీదుగా గుడిపెల్లికి చేరుకున్నారు. దారిలో మద్యం సేవించారు. రాత్రి 11 గంటలకు గుడిపెల్లి శివారుకు చేరుకున్నారు. రాత్రి 12 గంటల సమయంలో బాధితుల ఇంటికి ఉన్న రెండు తలుపుల నుంచి లోపల పెట్రోల్‌ లోపలకు పోసి నిప్పంటించారు. ఇంట్లో మంటల రేగడంతో చుట్టుపక్కల వారు మేల్కొనడంతో పెట్రోల్‌ డబ్బాలను చింతచెట్టు కింద వదిలి వచ్చిన ఆటోలో పరారయ్యారు.

వెంకటపూర్‌ నుంచి మంచిర్యాలలో లాడ్జికి చేరుకుని 17న అక్కడి నుంచి గది ఖాళీ చేసి వెళ్లిపోయారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉట్కూర్‌కు చెందిన వ్యక్తిపై ఇంతకుముందే హత్య కేసు నమోదైనట్లు గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి తల్లికి, మంటల్లో కాలిపోయిన శాంతయ్య తమ్ముడికి అక్రమ సంబంధం ఉండడంతో 15ఏళ్ల క్రితం అతడిని హత్య చేసినట్లు తాజా విచారణలో బయటపడింది.

పక్కాగా స్కెచ్….

గుడిపెల్లికి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నిందితులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామంలో మాస పద్మ శివయ్య దంపతులు, శాంతయ్య ఉన్నారా లేదా నిర్ధారించుకునేందుకు రూ.3 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఘటన జరిగిన రోజు మద్యం మత్తులో ఉన్న అతను ఇంట్లో ముగ్గురే ఉన్నారని తప్పుడు సమాచారం ఇవ్వడంతో, పద్మ అక్క కుమార్తె

న మౌనిక, ఇద్దరు పిల్లలు కూడా మంటలకు కాలి బూడిదయ్యారు. హత్య జరిగిన తర్వాత కూడా నిందితులు ఘటనా స్థలంలోనే ఉంటూ, నిందితులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేశాడు. నిందితులకు ఇంటి నిప్పు పెట్టిన తర్వాత అందులో చిక్కుకున్న వారు ప్రాణాలు కాపాడుకోడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. శవాలన్ని తలుపులు, కిటికీల వద్దే కాలి బూడిదయ్యాయి. మరోవైపు ఘటనలో చనిపోయిన శాంతయ్య మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు ఎవరు ముందుకు రాలేదు. అతని కుటుంబ సభ్యులందరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మార్చురీలోనే శవం ఉండిపోయింది.

Whats_app_banner