Lakhpati Didi Scheme : మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల రుణాలు- లఖ్ పతి దీదీ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా
Lakhpati Didi Scheme : స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా కేంద్రం లఖ్ పతి దీదీ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా డ్రోన్లు ఆపరేట్, రిపేర్, ఎల్‌ఈడీ బల్బుల తయారీ, ప్లంబింగ్ లో మహిళలకు శిక్షణ ఇస్తారు.
Lakhpati Didi Scheme : గ్రామీణ మహిళలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం'లఖ్ పతి దీదీ' పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15, 2023న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సూక్ష్మ సంస్థలను ప్రారంభించేలా మహిళలను ప్రోత్సహించే లక్ష్యంతో లఖ్ పతి దీదీ పథకాన్ని ప్రకటించారు. పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధితో ఆర్థిక సాధికారత ఈ స్కీమ్ లక్ష్యం. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. దీంతో ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తారు. అలాగే వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. మహిళలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రుణాలు అందిస్తారు.
ఈ పథకంలో భాగంగా ఆగస్టు 25న ప్రధాని మోదీ 11 లక్షల మంది మహిళలకు లఖ్ పతి దీదీ సర్టిఫికెట్లు అందించారు. ఈ పథకంలో భాగంగా రూ.2500 కోట్ల నిధులు విడుదల చేశారు. దీంతో 4.3 లక్షల స్వయం సహాయక బృందాల్లోని 48 లక్షల మంది మహిళలు ప్రయోజనం కలిగిందని కేంద్రం తెలిపింది. ఈ పథకం ద్వారా మహిళలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ పథకం కింద గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాల కోసం మహిళా స్వయం సహాయక సంఘాలకు(SHG) కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు అందిస్తుంది. దాదాపు 15,000 మంది మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడంలో నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. దీంతో పాటు ఈ పథకం కింద మహిళలకు ఎల్‌ఈడీ బల్బుల తయారీ, ప్లంబింగ్ వంటి నైపుణ్యాల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు.
లఖ్ పతి దీదీ యోజన అర్హతలు
- దరఖాస్తు చేసుకున్న మహిళ తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో శాశ్వత నివాసి(ఏ రాష్ట్రంలో అప్లై చేసుకుంటే అక్కడ) అయి ఉండాలి.
- మహిళ కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించి ఉండకూడదు.
- దరఖాస్తు చేసుకున్న మహిళ కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండకూడదు.
లఖ్ పతి దీదీ పథకం ప్రయోజనాలు
ఈ పథకంలో మహిళలకు ఎల్‌ఈడీ లైట్ల తయారీ, ప్లంబింగ్, డ్రోన్ రిపేర్లలలో శిక్షణ పొందేందుకు వీలుగా మహిళలను స్వయం సహాయక సంఘాలకు అనుసంధానం చేశారు. వ్యవసాయరంగానికి మరింత సాంకేతికతను జోడించేందుకు ఈ డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. డ్రోన్లు నీటిపారుదల, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకోస్తున్నాయి. ఈ పథకం ద్వారా వర్క్‌షాప్‌లు, రుణ సౌకర్యాలు, బీమా కవరేజ్, స్కిల్ డెవలప్మెంట్, ఆర్థిక ప్రోత్సాహకాలు మొదలైన అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తున్నారు.
లఖ్ పతి దీదీ యోజన స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోండి.
- ముందుగా స్థానిక స్వయం సహాయక గ్రూపులో చేరండి.
- అంగన్‌వాడీ కేంద్రంలో ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. అలా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకత్వం చేస్తారు.
- లఖ్ పతి దీదీ యోజన కోసం దరఖాస్తు ఫారమ్‌ను పొంది, వివరాలు పూరించండి.
- ఆపై నిర్దేశించిన కార్యాలయం లేదా అంగన్‌వాడీ కేంద్రంలో అవసరమైన అన్ని పత్రాలతో దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
- అనంతరం మీ దరఖాస్తు అర్హతపై ధృవీకరణ ప్రక్రియకు వెళుతుంది.
- తనిఖీల తర్వాత మీ అప్లికేషన్ ఆమోదంపై నిర్ణయం తీసుకుంటారు. ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు.
- ఎంపిక అనంతరం వర్క్‌షాప్‌లు, ఇతర శిక్షణా కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
- శిక్షణ అనంతరం మీకు ఆర్థిక సహాయం సహా అనేక ప్రయోజనాలు అందిస్తారు.
ఈ పథకంపై మరింత సమాచారం కోసం ఈ లింక్ లో https://lakhpatididi.gov.in/ చెక్ చేయండి.
సంబంధిత కథనం