Janasena Pawan Kalyan: డ్వాక్రా మహిళల రుణాల మాఫీని పరిశీలిస్తున్నామన్న పవన్-pawan kalyan said that we are considering the issue of loan waiver for dwakra women ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Pawan Kalyan: డ్వాక్రా మహిళల రుణాల మాఫీని పరిశీలిస్తున్నామన్న పవన్

Janasena Pawan Kalyan: డ్వాక్రా మహిళల రుణాల మాఫీని పరిశీలిస్తున్నామన్న పవన్

Sarath chandra.B HT Telugu
Feb 08, 2024 05:44 AM IST

Janasena Pawan Kalyan: ఏపీలో డ్వాక్రా మహిళల రుణాల మాఫీ అంశంపై కసరత్తు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ‌ ప్రకటించారు. జనసేన – తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగదని స్పష్టం చేశారు.

ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ‌
ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ‌

Janasena Pawan Kalyan: సిఎం జగన్మోహన్ రెడ్డి తన జేబులో నుంచి రూపాయి కూడా తీయడని, కష్టపడి సంపాదించిన సొమ్మునే కష్టంలో ఉన్న పదిమందికి పంచే తాను, ప్రజాధనాన్ని ప్రజలకే పదిలంగా పంచే బాధ్యత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మాల్సిన అవసరం లేదని, జనసేన మానవతా దృక్పథానికి అధికారం తోడయితే అద్భుతాలు జరుగుతాయన్నారు.

‘జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ముఖ్యమంత్రి జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేవారు. వ్యక్తిగత సంపాదననే ప్రజలు కష్టాల్లో ఉంటే పంచే మనస్తత్వం ఉన్నవాడిని ప్రజలు కట్టిన పన్నులు, ప్రజాధనం ఇంకెంత ఉదారంగా అందిస్తామో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు.

జనసేన – తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు కచ్చితంగా కొనసాగుతాయనీ.. ఒక్క పథకం కూడా ఆగదన్నారు. జగన్ ఏ రోజూ తన జేబులో నుంచి రూపాయి కూడా తీయడని.. సొంత సొమ్ము కోట్ల రూపాయలు తీసి కష్టాల్లో ఉన్నవారికిచ్చే వ్యక్తిని నేనన్నారు.

ప్రజా ధనాన్ని పదిలంగా ఇస్తాను అన్నారు. అవసరం అయితే పది రూపాయలు అధికంగా అందిస్తాం తప్ప, ఇప్పుడున్న ఏ పథకాన్ని నిలిపేది లేదని తెలిపారు. ఇటీవల వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ నుంచి బీమా సాయాన్ని బుధవారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అందచేశారు.

“తమ స్వయంశక్తితో దేశానికే ఆదర్శంగా నిలచిన డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేసి ప్రోత్సహించే విషయం తమ దృష్టిలో ఉంది"అని చెప్పారు. డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. రుణాల విషయంలో వారి సమస్యలు తెలుసుకున్నామన్నారు.

జనసేన – టీడీపీ ప్రభుత్వంలో రుణ మాఫీ చేసే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం. రద్దు దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. ఆపదలో ఉన్న వారికి సాయం చేయడానికి ప్రతిసారి అధికారం అవసరం లేదు. అయితే జనసేన పార్టీ చేస్తున్న మానవతాసాయానికి అధికారం తోడయితే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఆపదలో ఆదుకునే అవకాశం లభిస్తుందన్నారు

మూడు నెలల బీమా రెన్యూవల్ కోసం రూ.3.5 కోట్లు

నేను సినిమాలు చేసి కష్టార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తున్నానని కష్టంలో ఉన్న జనసేన కుటుంబంలోని సభ్యులకు అండగా నిలవడం బాధ్యతగా భావిస్తానని చెప్పారు.

కేవలం ఆర్ధిక సహాయం కాకుండా త్వరలోనే క్రియాశీలక సభ్యుల పిల్లలకు కూడా ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేసి వారి చదువుల కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తున్నామన్నారు. ఆశయం కోసం పని చేసే జనసైనికులు అనుకోని ప్రమాదంలో మృతి చెందితే మొదట తల్లడిల్లిపోయేది తానే అన్నారు.

బీమా కోసం వ్యక్తిగత సొమ్ము చెల్లింపు…

చాలా సార్లు వ్యక్తిగతంగా సహాయం అందించామని అయితే దీనిని వ్యవస్థీకృతం చేసి అందరికీ బీమా కల్పించడం ద్వారా అందరికీ సాయం అందుతుందన్న ఆలోచనతో రాజకీయ పార్టీగా గుర్తింపు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు.

మార్చి చివరి నాటికి క్రియాశీలక సభ్యుల బీమా గడువు తీరిపోతుందని వెంటనే అన్ని బీమాలను రెన్యూవల్ చేయాల్సి ఉందన్నారు. అయితే ఆ సమయానికి జనసైనికులు, వీర మహిళలు, క్రియాశీలక కార్యకర్తలు, వాలంటీర్లు, నాయకులు అంతా ఎన్నికల హడావుడిలో ఉంటారని బీమా రెన్యూవల్ 3 నెలలకు పొడిగించామన్నారు.

దానికి సంబంధించిన సొమ్మును వ్యక్తిగత సంపాదన నుంచే రూ. 3.5 కోట్లు చెల్లించానని పవన్ చెప్పారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే కార్యకర్తల కోసం, వారి భద్రతకు నిరంతరం ప్రాధాన్యం ఇస్తాను. వచ్చే ఎన్నికల్లో సమష్టిగా కష్టపడి పని చేసి పార్టీ గెలుపులో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.

వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. మొత్తం 20 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి బీమా మొత్తాన్ని అందించారు.

Whats_app_banner