LG Free Service to Flood Victims : వరద బాధితులకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సాయం, ఉచిత సర్వీస్ చేస్తామని ప్రకటన
LG Free Service to Flood Victims : వరద బాధితులకు సాయం అందించేందుకు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఖమ్మం జిల్లాలో నీట మునిగి పాడైన ఎల్జీ వస్తువులకు ఉచితంగా సర్వీస్ చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. స్పేర్ పార్ట్ లపై 50 శాతం రాయితీ ఇస్తామని పేర్కొంది.
LG Free Service to Flood Victims : వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఖమ్మం జిల్లాల్లో ఇళ్లు నీట మునిగి టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంస్థ ముందుకొచ్చింది. వరద నీటితో తడిచిన ఎల్జీ ఉత్పత్తులకు ఉచిత సర్వీస్ అందిస్తామని ప్రకటించింది. అలాగే స్పేర్ పార్ట్ లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపింది. వరదల్లో ఎల్జీ వస్తువులు పాడైతే తమను సంప్రదించాలని కోరింది. ఉచిత సర్వీస్ కోసం 08069379999, 9711709999 నెంబర్లను సంప్రదించాలని సూచించింది.
బుడమేరు గండ్లతో విజయవాడ ముంపునకు గురైన విషయం తెలిసిందే. విజయవాడ వరదలతో లక్షల మంది సర్వస్వం కోల్పోయారు. ఇళ్లు నీట మునిగి అన్ని వస్తువులు పూర్తిగా తడిచిపోయాయి. ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మిషిన్లు, గ్యాస్ స్టవ్స్ ఇలా అన్ని వస్తువులు రిపేర్‌కు వచ్చాయి. వాహనాలు, షాపులు, వ్యాపార సంస్థలకు ఇన్సురెన్స్ ఇప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే బైక్, కారు మెకానిక్ లను ఇళ్ల వద్దకే పంపి ఉచితంగా రిపేర్లు చేయిస్తుంది. కొందరు మెకానిక్‌లు విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు.
గ్యాస్ స్టవ్ లకు ఉచిత సర్వీస్
విజయవాడ విద్యాధరపురంలో ఉచితంగా గ్యాస్ స్టవ్‌లు రిపేర్ చేసేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. వరద బాధితుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వరదల వల్ల ఎవరివైనా గ్యాస్ స్టవ్‌లు రిపేర్‌కి వస్తే వాటిని ఉచితంగా రిపేర్ చేస్తానని ఫ్లెక్సీలో రాశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన వృత్తి ద్వారా వరద బాధితులకి సాయం చేయాలనే ఆలోచన చేయడం గొప్ప విషయమని అతడిని ప్రశంసిస్తున్నారు.
“వరద బాధితులను ఆదుకునేందుకు, ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు రమ్యకృష్ణ ఏజెన్సీస్ స్పందించింది. వరదల్లో తడిచి పాడైపోయిన గ్యాస్ స్టవ్‌లు ఉచితంగా రిపేర్ చేస్తున్న రమ్యకృష్ణ ఏజెన్సీస్ వారిని అభినందిస్తున్నాను”-నారా లోకేశ్
ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం
ఇటీవల భారీ వర్షాలు, వరదలకు ఎంతో మంది తమ వాహనాలు, ఇండ్లు, షాపులు, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వీటికి సంబంధించి బీమా క్లెయిమ్ లను త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీమా క్లెయిమ్ నమోదుకు వాట్సాప్, టోల్ ఫ్రీ నెంబర్, ఈ-మెయిల్, వెబ్ సైట్ ద్వారా బీమా కంపెనీలను నేరుగా సంప్రదించాలని ప్రజలకు సూచించింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా క్లెయిమ్ నమోదు చేసుకునేందుకు, అసెస్మెంట్ కోసం సర్వేయర్ ను,క్లెయిమ్ ఫారమ్ సబ్మిట్ చేసేందుకు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను అక్కడికక్కడే పరిష్కారం చేసేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసు ప్రాంగణంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని బీమా కంపెనీల ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. అందువల్ల బీమా చేసుకున్న వారు క్లెయిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ సేవలను సోమవారం (09.09.2024) నుంచి ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
సంబంధిత కథనం