Tirumala : తిరుమలలో 'ఆణివార' ఆస్థానం - జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం-koil alwar tirumanjanam in connection with anivara asthanam will be observed in tirumala on july 9 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమలలో 'ఆణివార' ఆస్థానం - జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala : తిరుమలలో 'ఆణివార' ఆస్థానం - జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 04, 2024 08:24 PM IST

Koil Alwar Tirumanjanam at Tirumala : శ్రీవారి ఆలయంలో జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది.

శ్రీవారి ఆలయంలో జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
శ్రీవారి ఆలయంలో జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koil Alwar Tirumanjanam at Tirumala : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూలై 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహిస్తుంటారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగుతుందని టీటీడీ తెలిపింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.

శ్రీనివాసమంగాపురంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 10 నుండి 12వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. 

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.

సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. 

జూలై 10న పెద్దశేష వాహనం, జూలై 11న హనుమంత వాహనం, జూలై 12న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

విశేష ఉత్స‌వాలు…..

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జులై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.  జులై 6, 13, 20, 27వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

జులై 5న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు. జులై 6న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.  జులై 21న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

జులై 16న ఆణివార ఆస్థానం ఉంటుంది.  జులై 30 నుండి ఆగస్టు 2వ తేదీ వ‌ర‌కు ప‌విత్సోత్స‌వాలు జ‌రుగ‌ుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

 

Whats_app_banner