Tirumula Tirupathi Devasthanams Updates : తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది.
అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా అసత్యమని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది.
సోమవారం టీటీడీ ఈవో జె శ్యామల రావు అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై… స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి సుదీర్ఘంగా చర్చించారని తెలిపింది. అంతేతప్ప వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం పెంచినట్టు పుకార్లు సృష్టిస్తున్నారని టీటీడీ తెలిపింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని,,, ఇటువంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని భక్తులను కోరింది.
శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజనీరింగ్, భద్రత విభాగాలతో కాలిబాట భక్తుల భద్రత చర్యలపై ఈవో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ…. ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఏడవ మైల్ వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటి కప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జంతువుల కదలికలపై సమాచారాన్నిఎప్పటికప్పుడు భద్రత విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సంయుక్త కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని.. సదరు కమిటీ వారికి తక్కువ ఖర్చుతో అయ్యే నిర్మాణాలను మరియు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించవలసిందిగా వారికి ఉత్తరం రాయాలని అధికారులను సూచించారు.
కాలినడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా, ఆ సమయాల్లో మార్పులు చేయవలసిందిగా పలువురు ఈవో దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన అధికారులతో చర్చించి, తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జేఈవో వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్వో నరసింహ కిషోర్ కు సూచించారు.
అంతకుముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారిచ్చిన ప్రతిపాదనలను అటవీ విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సంబంధిత ప్రతిపాదనలలో ఏఏ పనులు చేపట్టడం జరిగింది, ఎన్ని పురోగతిలో ఉన్నాయి, ఇంకెన్ని పనులు చేయవలసి ఉన్నాయి అనే అంశాలపై ఈవో సమీక్షించారు.