YS Sharmila On CM Jagan : ఇప్పుడున్న జగన్ నా అన్నే కాదు, సాక్షిలో నాకు వాటా ఉంది- వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila On CM Jagan : జగన్ సీఎం అయ్యాక మారిపోయారని, ఇప్పుడున్న జగన్ నా అన్నే కాదని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. సాక్షిలో తనకూ వాటా ఉందన్నారు.
YS Sharmila On CM Jagan : జగన్ సీఎం అయ్యాక మారిపోయారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సోమవారం కడప జిల్లాలో పర్యటించిన షర్మిల కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ... ఇప్పుడున్న జగన్ నా అన్న కానే కాదన్నారు. జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. వైసీపీలోని జగన్ సైన్యం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. రోజుకొక జోకర్ తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. మహిళ అని కూడా చూడకుండా చాలా దిగజారి మాట్లాడుతున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. తాను పులివెందుల పులిబిడ్డనన్న షర్మిల.. ఎవ్వరికి భయపడనన్నారు. ఏం చేస్తారో చూస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాక్షి పత్రికలో తనకు కూడా వాటా ఉందన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ తనపై దుష్ప్రచారం చేయిస్తుందని తీవ్రంగా స్పందించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనన్నారు. ఎవరు ఏం చేసినా బెదిరేది లేదన్నారు.
జగన్ సైన్యంతో దుష్ప్రచారం
తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న సాక్షి మీడియాలో తనకు సైతం వాటా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. తానూ రాజశేఖర్ రెడ్డి బిడ్డనేన్న షర్మిల... సాక్షిలో తనకు తప్పకుండా భాగం ఉందన్నారు. కొందరు జోకర్ గాళ్లు బుద్ధిలేకుండా సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. జగన్ రెడ్డి సైన్యంలో రోజుకొక జోకర్ ను తనపైకి పంపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పులివెందుల బిడ్డనేనని ఏమి పీక్కుంటారో పీక్కోండి అంటూ వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.
భారతితో కలిసే సోనియా వద్దకు
వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని షర్మిల గుర్తుచేశారు. వైసీపీ కోసం ఎంతో కష్టపడితే ఇవాళ తనపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారన్నారు. ప్రణబ్ ముఖర్జీతో కలిసి తన భర్త అనిల్ కుమార్ రాజకీయం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్ జైల్లో పెట్టించి తాను సీఎం కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు అనుకూల మీడియాతో ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. జగన్ భార్య భారతి రెడ్డితో కలిసే అనిల్ అప్పుడు సోనియా గాంధీ వద్దకు వెళ్లారన్నారు. వైసీపీకి దమ్ముంటే ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడగాలన్నారు.
జగన్ పత్రికలో నాకూ వాటా
జగన్ పత్రికలో తనపై వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పత్రికలో సీఎం జగన్‌కు ఎంత భాగస్వామ్యం ఉందో తనకూ అంతే ఉందన్నారు. ఆ విషయం మరిచి ఇష్టానుసారం వార్తలు రాయిస్తున్నారన్నారు. వైసీపీ నేతలు ఏం రాసినా, ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన మార్క్ సంక్షేమ పాలన అందించారన్నారు. వైఎస్ఆర్ మార్క్ పాలన వైసీపీ పాలనలో లేదన్నారు. కడప జిల్లాకు చెందిన జగన్ సీఎం అయినా స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.