YS Sharmila Comments : జగన్ అన్న వల్లే మా కుటుంబం చీలిపోయింది - వైఎస్ షర్మిల
YS Sharmila Latest News: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వైఎస్ఆర్ కుటుంబం చీలిందంటే.. అది చేతులారా జగన్ అన్న చేసుకున్నదే అంటూ విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు. ఇందుకు దేవుడు, తల్లి విజయమ్మే సాక్ష్యమని చెప్పుకొచ్చారు.
YS Sharmila On CM Jagan: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అన్న తీరు వల్లే వైఎస్ఆర్ ఫ్యామిలీ చీలిపోయిందని చెప్పారు. గురువారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆమె... సోదరుడు, సీఎం జగన్ ను నేరుగా టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక… జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయారని చెప్పారు.
"కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, తమ కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ ఆన్న గారు. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే చంద్రబాబు,జగన్ ఆన్న గారే కారణం. ఇవాళ మా కుటుంబం చీలిందంటే అది చేతులారా చేసుకున్నది జగన్ ఆన్న గారే. దీనికి సాక్ష్యం దేవుడు...దీనికి సాక్ష్యం నా తల్లి,వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం" అని వైఎస్ షర్మిల అన్నారు.
వారికోసం నిస్వార్థంగా పని చేశా - షర్మిల
"జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందిలో ఉంటే.. 18 మంది రాజీనామాలు చేసి జగన్ ఆన్న గారి వైపు నిలబడ్డారు. అధికారంలో వచ్చాకా మంత్రులను చేస్తా అన్నారు. ఇవాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు...? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ,నేను వాళ్ళ కోసం తిరిగాం. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని,పిల్లలకు పక్కన పెట్టీ...ఎండనక,వాన అనక రోడ్ల మీదనే ఉన్నాను. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కాదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా,స్వలాభం చూడకుండా,నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మిస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా. మిమ్మల్ని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు వేరే మనిషిలా మారిపోయారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు ..YSR పేరు,ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నాను. YSR పేరు నిలబెడతాడు అనుకున్నా. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు" అని వైఎస్ షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు.
ఒక్క స్కీమ్ అమలు కావటం లేదు…
"బీజేపీ కి ఒక్క ఎమ్మెల్యే లేడు,ఎంపీ లేడు. అయినా ఏపిలో బీజేపీ రాజ్యం ఏలుతుంది. జగన్ గారు ఆయన పార్టీని,రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు. పోలవరం ప్రాజెక్ట్ YSR డ్రీమ్ ప్రాజెక్ట్. అంతకు ముందు ఏ ప్రభుత్వాలు చేయని సాహసం YSR చేశారు. వైఎస్సార్ 2004 లో ముఖ్యమంత్రిగా ఆయిన 6 నెలల్లో ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టారు. వైఎస్సార్ హయాంలో 4500 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వించారు. వైఎస్సార్ మరణించిన తర్వాత... TDP, YCP ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్ ను నిరక్ష్యం చేశాయి. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చింది. వైఎస్సార్ పనితీరు మీలో కల్పిస్తే మీరు వైఎస్సార్ వారసులు అవుతారు. జగన్ ఆన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ.వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ. వైఎస్సార్ పథకాలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ఇది రైతు రాజ్యం కాదు..వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదు" అని అన్నారు వైఎస్ షర్మిల.
"వైఎస్సార్ పాలనకు జగన్ ఆన్న పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు సోనియా గాంధీ గారిని కలిశా. వాళ్ళు వైఎస్సార్ పై పెట్టుకున్న ప్రేమ అభిమానాన్ని చూశా. వైఎస్సార్ ఉంటే కాంగ్రెస్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు. వైఎస్సార్ కుటుంబంలో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నేను కాంగ్రెస్ లో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నాను. నన్ను కాంగ్రెస్ ఏపికి వెళ్ళమంటే పని చేయాలని నిర్ణయించుకున్నా. ఇక్కడ బీజేపీ చేస్తున్న తెర వెనుక రాజకీయాలను తెలుసుకున్నాను. ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు. ఈ నిర్ణయం తో నేను టార్గెట్ అవుతా అని తెలుసు .నన్ను ఎటాక్ చేస్తారని తెలుసు. నా కుటుంబం నిట్టనిలువునా చీలుతుంది అని తెలుసు. అయినా నేను తీసుకున్న నిర్ణయం ప్రజల కోసమే" అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.