Jagananna chedodu: వెనుకబడిన కులాలను వెన్నెముక కులాలుగా మార్చామన్న జగన్-jagan said that backward castes have been converted into backbone castes in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jagananna Chedodu: వెనుకబడిన కులాలను వెన్నెముక కులాలుగా మార్చామన్న జగన్

Jagananna chedodu: వెనుకబడిన కులాలను వెన్నెముక కులాలుగా మార్చామన్న జగన్

Sarath chandra.B HT Telugu
Oct 19, 2023 12:38 PM IST

Jagananna chedodu: వెనుకబడిన కులాలు, వర్గాలను వెన్నెముక కులాలుగా మారుస్తానని పాదయాత్రలో మాట ఇచ్చినట్టుగా 52నెలల పాలనలో నవరత్నాల్లోని ప్రతి కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలను చేయి పట్టి నడిపిస్తున్నట్టు సిఎం జగన్ చెప్పారు.

ఎమ్మిగనూరు జగనన్న చేదోడు కార్యక్రమంలో మాట్లాడుతున్న సిఎం జగన్
ఎమ్మిగనూరు జగనన్న చేదోడు కార్యక్రమంలో మాట్లాడుతున్న సిఎం జగన్

Jagananna chedodu: సొంత షాపులు ఉన్న రజక, నాయిబ్రహ్మణ, టైలర్లకు ఏటా పదివేల ఆర్ధిక సాయం చేస్తూ జగనన్న చేదోడు ద్వారా పదివేలు నేరుగా వారి ఖాతాలకు పంపుతున్నట్లు సిఎం జగన్‌ చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా నేడు 3.25లక్షల మందికి రూ.325కోట్లను వారి ఖాతాలకు పంపుతున్నట్లు చెప్పారు.

3.25లక్షల మందికి లబ్ది కలిగిస్తున్న జగనన్న చేదోడు పథకంలో లక్షా 85వేల మంది టైర్లు, 1,4,500మంది రజకులు, 40వేల మంది నాయిబ్రాహ్మణులకు మంచి జరుగుతోందన్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.1251 కోట్ల రుపాయలు ఇచ్చినట్లు చెప్పారు.

నాలుగేళ్లలో జగనన్న చేదోడు పథకం ద్వారా లక్షల మందికి 40వేల రుపాయలు అయా కుటుంబాలకు నేరుగా అందించినట్లు చెప్పారు. గతానికి ఇప్పటికి పోలిక చూడాలని, 52నెలల్లో ప్రతి అడుగు ఇలాగే వేసినట్లు వివరించారు. నాలుగేళ్లలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో 2లక్షల 38వేల కోట్ల రుపాయలు నేరుగా లబ్దిదారుల ఖాతాలకు పంపినట్లు చెప్పారు.

చేతి వృత్తుల నమ్ముకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారికి బ్రతకలేని పరిస్థితుల్లో ఉంటే గతంలో ఎవరు వారి గురించి ఆలోచించలేదన్నారు. 52నెలల పాలనలో ప్రతి అడుగులో తోడుగా ఉంటూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల్లో తోడుగా ఉంటూ ఏటా క్రమం తప్పకుండా వారికి సాయం అందించే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

ప్రతి అడుగులో నా ఎస్సీ,నా ఎస్టీ,నా బీసీ అనుకుంటూ వారి చేయి పట్టి నడిపించే కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పిల్లలకు మేనమామగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు సంక్షేమం కోసం రూ.14,109కోట్ల రుపాయలు వైఎస్సార్ చేయూత పథకంలో అందించినట్లు చెప్పారు. మరో ఐదు వేల కోట్లను త్వరలో మహిళలకు చెల్లించనున్నట్లు తెలిపారు.

కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాల ద్వారా లక్షలాది మంది మహిళలకు లబ్ది చేకూర్చినట్లు చెప్పారు. వైఎస్సార్ మత్స్యకార భరోసాలో రూ.538కోట్లను అందించినట్లు చెప్పారు. నేతన్న నేస్తంలో 82వేల కుటుంబాలకు రూ.902కోట్లను చెల్లించామన్నారు. 2,75,939డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా రూ.1302కోట్లను చెల్లించామన్నారు. జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారాలు చేసే వారికి అండగా ఉంటూ, రూ.10వేల వడ్డీ లేని రుణాలు అందించినట్లు చెప్పారు. గతంలో ఎప్పుడైనా ఈ తరహా కార్యక్రమాలు అమలయ్యాయో లేదో గుర్తు చేసుకోవాలన్నారు.

ప్రతి పేద కుటుంబానికి తోడుగా ఉండే అడుగులు నాలుగేళ్లలో మాత్రమే పడ్డాయన్నారు. 52నెలల పరిపాలనలో రూ.2.38లక్షల కోట్ల రుపాయలు ఇవ్వగలిగినట్టు చెప్పారు. ఓ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా అర్హత ఉంటే నేరుగా ఖాతాలకు డబ్బు వచ్చి పడుతుందని ఎవరైనా అనుకున్నారా అని సిఎం జగన్ ప్రశ్నించారు.

అప్పుడు ఇప్పుడు అదే బడ్జెట్ ఉందని, ముఖ్యమంత్రి మాత్రమే మారాడని అప్పులు కూడా గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయని, అప్పుడు ఈ కార్యక్రమాలు ఎందుకు జరగలేదు, ఇప్పుడెందుకు జరుగుతున్నాయో చూడాలన్నారు. గతానికి ఇప్పటికి ఉన్న తేడా నాయకుల మనసు మాత్రమే తేడా అన్నారు.

అప్పట్లో గజదొంగల ముఠా ఉండేదని, వారికి దోచుకోవడం పంచుకోవడం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ఏ పేదమైనా ఏమి కోరుకుంటుందో ఆలోచించాలి అన్నారు.రైతులైనా రైతు కూలీ కుటుంబాలైనా ఏమికోరుకుంటారో దానిని వారికి అందిస్తున్నామని చెప్పారు.