IT Employees Car Rally : ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీకి నో పర్మిషన్, గరికపాడు వద్ద పోలీస్ పికెటింగ్
IT Employees Car Rally : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రేపు(ఆదివారం) హైదరాబాద్ నుంచి విజయవాడకు ఐటీ ఉద్యోగులు కారు ర్యాలీ చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
IT Employees Car Rally : రాష్ట్ర సరిహద్దు ప్రాంతం గరికపాడు వద్ద ఎన్టీఆర్ జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సరిహద్దు వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీస్ పికెటింగ్ ను విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు.
కారు ర్యాలీకి నో పర్మిషన్
ఐటీ ఉద్యోగుల “కారులో సంఘీభావ యాత్ర”కు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎటువంటి అనుమతులు లేవని డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీ తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో ఈ నెల 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు “కారులో సంఘీభావ యాత్ర” తలపెట్టినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఈ విషయమై ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఏవిధమైన వాహన ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదన్నారు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ర్యాలీలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించి నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తారో వారిపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 143, 290,188, R/W 149, సెక్షన్ 32 పోలీసు యాక్ట్, పి.డి.పి.పి.చట్టం సెక్షన్ 3 కింద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాల యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయం గమనించి అనుమతి లేని కారు యాత్రలో పాల్గొనవద్దని విశాల్ గున్నీ సూచించారు.
హింసకు పాల్పడే అవకాశం
గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ధర్నా కార్యక్రమంలో పాల్గొని హింసకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందిందని విశాల్ గున్నీ తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా కారు ర్యాలీకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. నేటి నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల అన్నింటినీ పూర్తిగా తనిఖీలు చేస్తున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీ స్పష్టం చేశారు.