Public Sector Banks Fraud: విద్యార్ధుల సమ్మతి లేకుండానే ఇన్సూరెన్స్ వసూళ్ళు, జేవీడి ఖాతాలతో బ్యాంకుల వ్యాపారం
Public Sector Banks Fraud: జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ప్రభుత్వ నగదు బదిలీ కోసం ఉమ్మడి ఖాతాలు ప్రారంభించాలన్న ఏపీ ప్రభుత్వ ఆదేశాలను బ్యాంకులు తమకు అనుగుణంగా మలచుకుంటున్నాయి. ఖాతాదారులకు తెలియకుండానే బీమా పథకాలకు డబ్బు వసూలు చేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.
Public Sector Banks Fraud: ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యార్ధుల ఫీజుల వసూళ్లలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం విద్యార్ధులకు ఉమ్మడి ఖాతాల నిబంధన అమల్లోకి తీసుకు వస్తే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు దానిని తమ వ్యాపార లక్ష్యాలకు అనువుగా మార్చుకున్నాయి. లక్షల్లో ఉన్న విద్యార్ధులు ఖాతాలకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాలను అనుసంధానిస్తున్నారు.
పిఎంజేజేబీవై, పిఎంఎస్‌బివై యాక్సిడెంట్ పాలసీలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 2015లో ఈ రెండు బీమా పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది. స్వల్ప ప్రీమియంతో జీవిత బీమాతో పాటు, ప్రమాద బీమా కల్పించే పథకాలను కేంద్రం ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియం చెల్లింపులతో ప్రతి ఒక్కరికి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీటిని అమలు చేస్తున్నారు.
ఈ పథకాల ఉద్దేశం మంచిదే అయినా ప్రజల్లో అవగాహన లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వాటిని వినియోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తరచూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జేవీడీ ఖాతాలను జాయింట్ అకౌంట్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో బ్యాంకుల పంట పండినట్టైంది.
ప్రభుత్వ ఉద్దేశం ఇది…
ఏపీలో గనన్న విద్యాదీవెన పథకంలో సాంకేతికంగా ఎదురవుతున్నసమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్పుల చెల్లింపును గతంలో నేరుగా కాలేజీలకు రీయింబర్స్ చేసేవారు. ఈ విధానంలో విద్యార్ధులు కాలేజీలకు రాకపోయినా ఫీజుల చెల్లించడం, లేని విద్యార్ధుల పేరుతో లబ్ది పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది.
డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్ధులకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల్లో ఫీజుల్ని చెల్లిస్తోంది.వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్ధి తల్లి ఖాతాలకు ఫీజులు జమ చేస్తున్నారు. అయితే ఈ విధానంలో సాంకేతికంగా కొన్ని సమస్యలు ఎదరవుతున్నాయి.
ఫీజుల రుసుముల్ని కొన్నిసార్లు వ్యక్తిగత అవసరాలకు వాడేసుకోవడం, సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడం జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యార్ధులు వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసిన డబ్బులు, తల్లుల ఖాతాల్లో పడిన ఫీజుల్ని రకరకాల కారణాలతో కాలేజీలకు చెల్లించడం లేదు.
విద్యార్ధుల తల్లి పేరిట వ్యక్తిగత రుణాలు, స్వయం సహాయక రుణాలు ఉంటే సదరు ఖాతాలో ఫీజుల కోసం చెల్లించిన డబ్బుల్ని బ్యాంకులు వాటికి మళ్లిస్తున్నట్లు గుర్తించారు. ఆటో డెబిట్ సదుపాయం ఉండటంతో ఫీజు రియింబర్స్‌మెంట్ మొత్తాలను కాలేజీలకు చేరకుండా పోతుండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
జగనన్న విద్యాదీవెన నాలుగో విడత ద్వారా లబ్ధిపొందేందుకు తల్లి, విద్యార్థితో కూడిన నూతన జాయింట్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 24వ తేదీలోగా కొత్త ఖాతాలను తెరవాలని విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు సమాచారం ఇచ్చారు.
2022-23 ఆఖరి సంవత్సరం పూర్తయిన అన్ని కేటగిరిల విద్యార్థులు తప్పకుండా జాయింట్ అకౌంట్స్ తెరవాలని సూచించారు. విద్యార్థులను ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌గా , తల్లిని సెకండరీ అకౌంట్ హోల్డర్‌గా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తల్లి మరణిస్తే.. తండ్రి లేదా సంరక్షకుడు రెండో ఖాతాదారునిగా ఉండాలని వివరించారు.
ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే.. అందరూ కలిసి ఒకే బ్యాంకు ఖాతా తెరవొచ్చని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవాల్సిన విద్యార్థిని ప్రైమరీ అకౌంట్ హోల్డర్‌గా గుర్తించాలని సూచించారు.
రాష్ట్రంలోని ఏ బ్యాంకులోనైనా జాయింట్ ఖాతాలు తెరవొచ్చని కొత్త ఖాతాలకు ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ వంటి సేవలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ సదుపాయాలు ఉన్న ఖాతాలకు ఏటిఎం, మొబైల్ బ్యాంకింగ్ సేవల్ని నిలిపివేయాలని ఆదేశించారు. బ్యాంకు అకౌంట్లకు చెక్ బుక్‌కు మాత్రమే తీసుకునేందుకు అనుమతి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకు కూడా ప్రభుత్వం సమాచారం పంపింది.
ఖాతాదారులకు తెలియకుండానే నగదు వసూళ్లు...
రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇవ్వడంతో కొత్త ఖాతాలు, పాత ఖాతాలనే తేడా లేకుండా బ్యాంకుకు వచ్చిన ప్రతి ఒక్కరి ఖాతాలకు పిఎంజేజేబివై, పిఎం సురక్ష బీమా యోజన పథకాలను అనుసంధానించేశారు. ఖాతాదారుల సమ్మతి, అమోదం, సంతకాలు లేకుండానే ఇలా పెద్ద సంఖ్యలో బీమా ఖాతాలు తెరిచేశారు. దీంతో కొందరు విద్యార్ధులు ట్విట్టర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు.
విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల అమోదం లేకుండా, కనీసం వారి సంతకాలు కూడా లేకుండా బీమా పథకాల రూపేణా నగదు వసూలు చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశం వైరల్‌గా మారడంతో ఇటీవల ప్రారంభించిన బీమా లావాదేవీలపై బ్యాంకులు తనిఖీలు ప్రారంభించాయి.
ఎస్‌బిఐ, కెనరా బ్యాంకుల్లో ఈ తరహా ఉల్లంఘనలు ఎక్కువగా జరిగినట్టు వెలుగు చూసింది. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై ఎక్స్ వేదికగా విద్యార్ధులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక బ్యాంకులు తలలు పట్టుకుంటున్నాయి. బ్యాంకుల కేంద్ర కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాలతోనే బీమా పథకాలను అమలు చేశామని కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు.