Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ-indian students in kyrgyzstan safe riots under control no worries says foreign ministry ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Students In Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

Students in Kyrgyzstan: కిర్గిజిస్తాన్‌లో భారత విద్యార్థులు సేఫ్, అల్లర్లు అదుపులోకి, ఆందోళన వద్దన్న విదేశాంగ శాఖ

Sarath chandra.B HT Telugu
May 20, 2024 09:04 AM IST

Students in Kyrgyzstan: కిర్గిజ్‌స్తాన్‌లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన విదేశీ విద్యార్ధులపై దాడులు జరుగుతుండటంతో విదేశాంగ శాఖ జోక్యం చేసుకుంది. అత్యవసరమైతే విదేశాంగ హెల్ప్‌లైన్లను సంప్రదించాలని విద్యార్ధులకు భారత విదేశాంగ శాఖ అలర్ట్ జారీ చేసింది.

కిర్గిజిస్తాన్‌లో విదేశీ విద్యార్ధులపై దాడులతో  ఆందోళన
కిర్గిజిస్తాన్‌లో విదేశీ విద్యార్ధులపై దాడులతో ఆందోళన (AP)

Students in Kyrgyzstan: కిర్గిజ్ స్తాన్ దేశంలో స్థానిక సమస్యల నేపథ్యంలో ఒక ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు,విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే కిర్గిజ్ స్తాన్ లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 0555710041 ను సంప్రదించాలని సూచిస్తూ భారత విదేశాంగ శాఖ మే18న మార్గదర్శకాలు జారీ చేసింది.

కిర్గిజిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది. విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలని, భారత రాయబార కార్యాలయంతో నిత్యం అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

ఏపీ నుంచి పెద్దసంఖ్యలో విద్యార్ధులు కిర్గిజిస్తాన్‌లో మెడిసిన్ , ఇంజనీరింగ్ కోర్సుల్ని చదువుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏపీఎన్ఆర్టీఎస్ కూడా విద్యార్ధుల్ని అప్రమత్తం చేసింది. ఏపీఎన్ఆర్టీఎస్ ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ, పరిస్థితిని తెలుసుకుంటోంది. ఇప్పటి వరకు నలుగురు తెలుగు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ ను సంప్రదించారు. అల్లర్లు జరుగుతున్న ప్రదేశాలలో ఉన్న భారతీయ/తెలుగు విద్యార్థులందరూ సురక్షిత ప్రదేశాలలో ఉన్నారని తెలిపారు.

భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఎక్కువ సంఖ్యలో కిర్గిజ్ స్తాన్ వెళ్తారు. అందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు భారతీయ విద్యార్థులపై ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు నివేదిక లేదని ఏపీఎన్నాఆర్టీఎస్‌ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ కు విద్యార్థులు ఏదైనా ఇబ్బందులు తలెత్తితే ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు +91 863 2340678, +91 8500027678 (W) మరియు కిర్గిజ్ స్తాన్ లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్ 0555710041 ను సంప్రదించగలరు. ఏపీఎన్ఆర్టీఎస్ ఇమెయిల్స్: info@apnrts.com; helpline@apnrts.com; ద్వారా కూడా సంప్రదించాలని సూచించారు.

కిర్గిజిస్తాన్‌లో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని బిష్కెక్లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నుంచి బిష్కెక్ లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయని కిర్గిజిస్తాన్ లోని పాక్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపింది.

శుక్రవారం సాయంత్రం నుంచి బిష్కెక్ లో విదేశీ విద్యార్థులపై మూకదాడులు జరుగుతున్నాయి. కిర్గిజ్ విద్యార్థులు, ఈజిప్టుకు చెందిన వైద్య విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలను ఆన్లైన్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని కిర్గిజిస్తాన్లోని పాక్ రాయబార కార్యాలయం తెలిపింది.

కిర్గిజిస్తాన్ లోని భారత రాయబార కార్యాలయం భారతీయ విద్యార్థులను ఇళ్లలోనే ఉండాలని, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. విద్యార్థుల కోసం భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్ కాంటాక్ట్ నంబర్ కూడా అందుబాటులో కి తీసుకొచ్చింది.

పాక్ విద్యార్ధుల తరలింపు…

కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్‌లోని విద్యార్థుల వసతిగృహం వద్ద స్థానికులు, విదేశీయుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో 650 మందికి పైగా పాకిస్తాన్ విద్యార్థులను కిర్గిజిస్తాన్ నుంచి వెనక్కి పంపుతున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆదివారం తెలిపారు. వివిధ దేశాలకు చెందిన వందలాది మంది విద్యార్థులతో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణల్లో నలుగురు పాక్ విద్యార్థులు గాయపడ్డారు.

విద్యార్థులను ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించినట్లు నగరంలోని విద్యార్థులు పాక్ మీడియాకు తెలిపారు. విద్యార్ధుల్ని తరలించడానివకి మూడు ప్రత్యేక, వాణిజ్య విమానాలను ఏర్పాటు చేసినట్లు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇస్లామాబాద్ లో విలేకరుల సమావేశంలో తెలిపారు.

పాక్ విద్యార్థులపైనే కాకుండా విదేశీ విద్యార్థులపై జరిగిన దాడిగా పాకిస్తాన్‌ ప్రకటించింది. భారత్, బంగ్లాదేశీ, అరబ్ విద్యార్థులు కూడా ఉన్నారని పాక్ రాయబార వర్గాలు ప్రకటించాయి.

శనివారం 130 మంది విద్యార్థులు, ఆదివారం మరో 540 మంది విద్యార్థులు పాక్ కు చేరుకున్నారు. ఘర్షణలపై వివరాలు అందించేందుకు కిర్గిజిస్తాన్ చార్జ్ డి అఫైర్స్ ను శనివారం విదేశాంగ కార్యాలయానికి పిలిపించింది. విదేశీ విద్యార్థులను తమ వసతి గృహాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ అల్లర్లు చోటుచేసుకున్నాయని కిర్గిజిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆన్ లైన్ లో ప్రచురించిన ఒక ప్రకటనలో తెలిపింది.

విదేశీ విద్యార్థులే లక్ష్యంగా కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలతో భారతీయులు వణికిపోతున్నారు. హాస్టల్‌ గదులు వదిలి బయటకు రావడం లేదు. అక్కడి విద్యాసంస్థలు పరీక్షలను వాయిదా వేశాయి. చాలా మంది భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజా పరిణామాలపై విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది.

Whats_app_banner