YS Avinash Reddy : 7 గంటల పాటు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ- వాట్సాప్ కాల్స్, ఫండింగ్ పై ఆరా-hyderabad ys viveka murder case mp avinash reddy attend cbi investigation whats app calls funding details noted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Avinash Reddy : 7 గంటల పాటు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ- వాట్సాప్ కాల్స్, ఫండింగ్ పై ఆరా

YS Avinash Reddy : 7 గంటల పాటు అవినాష్ రెడ్డిని విచారించిన సీబీఐ- వాట్సాప్ కాల్స్, ఫండింగ్ పై ఆరా

Bandaru Satyaprasad HT Telugu
Jun 10, 2023 06:54 PM IST

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సుమారు 7 గంటల పాటు సీబీఐ విచారించింది. విచారణలో వాట్సాప్ కాల్స్, రూ.4 కోట్ల ఫండింగ్ పై సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఎంపీ అవినాష్ రెడ్డి
ఎంపీ అవినాష్ రెడ్డి

YS Avinash Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. శనివార ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాష్ రెడ్డి సుదీర్ఘంగా విచారించారు అధికారులు. సుమారు 7 గంటల పాటు సీబీఐ విచారణ సాగింది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని హైకోర్టు గత నెల 31న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత శనివారం విచారణకు హాజరైన అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని వెంటనే విడుదల చేసింది. ముందస్తు బెయిల్ సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి ప్రతీ శనివారం సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7 గంటల పాటు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ అవినాష్ రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. ఏడు గంటల విచారణలో సీబీఐ పలు విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. వాట్సప్ కాల్స్, రూ.4 కోట్ల ఫండింగ్పై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అప్రూవర్ దస్తగిరిని ప్రలోభాలకు గురిచేయడంపై ప్రశ్నించినట్లు కీలక సమాచారం.

ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు సునీతారెడ్డి

అయితే ఎంపీ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీతారెడ్డి పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు జూన్ 13 వాదనలు విననుంది. శుక్రవారం జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌తో కూడిన ధర్మాసనం ఎదుట సునీతా తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఈ పిటిషన్ ను ప్రస్తావించారు. ఏప్రిల్‌ 24న ముందస్తు బెయిల్‌పై విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించిందన్నారు. వేసవి సెలవుల కారణంగా ముందస్తు బెయిల్ పై విచారణ జరుపలేదన్నారు. దీంతో హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారించాలని సుప్రీంకోర్టు సూచించిందన్న విషయాన్ని సునీతారెడ్డి లాయర్ ధర్మాసనానికి గుర్తుచేశారు.

భాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ

వివేకా హత్య కేసులో ఏ7గా ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ నిరాకరించింది. భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ సీబీఐ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 6న తీర్పు రిజర్వు చేసిన కోర్టు, బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ తాజాగా ఆదేశాలిచ్చింది. భాస్కర్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు వాదనలు వినిపిస్తూ... పిటిషనర్‌కు వ్యతిరేకంగా అప్రూవర్‌ దస్తగిరి వాంగ్మూలం తప్ప మరే ప్రత్యక్ష సాక్ష్యం లేదన్నారు. అన్నీ వినికిడి సాక్ష్యాలే అన్నారు. భాస్కర్‌లరెడ్డి, అవినాష్ రెడ్డిపై సీబీఐ ఆరోపణలు చేసిందన్నారు. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చినప్పుడు, భాస్కర్‌ రెడ్డి జైల్లో ఉండడం సమంజసం కాదని వాదించారు. భాస్కర్ రెడ్డి అనారోగ్య సమస్యలు దృష్ట్యా బెయిల్‌ ఇవ్వాలని కోరారు. అయినా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.