TTD Ghee Price Issue: ఆవునెయ్యి అంత చౌకగా ఎలా.. ఆ ధరకు సరఫరా సాధ్యమేనా? నెయ్యి కాంట్రాక్టుల్లో మర్మం ఏమిటి?-how can cow ghee be so cheap is it possible to supply it at that price what is the secret of ghee contracts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Ghee Price Issue: ఆవునెయ్యి అంత చౌకగా ఎలా.. ఆ ధరకు సరఫరా సాధ్యమేనా? నెయ్యి కాంట్రాక్టుల్లో మర్మం ఏమిటి?

TTD Ghee Price Issue: ఆవునెయ్యి అంత చౌకగా ఎలా.. ఆ ధరకు సరఫరా సాధ్యమేనా? నెయ్యి కాంట్రాక్టుల్లో మర్మం ఏమిటి?

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 20, 2024 12:44 PM IST

TTD Ghee Price Issue: కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగిస్తున్న ఆవు నెయ్యి కల్తీపై ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చాలా ప్రశ్నల్ని లేవనెత్తాయి. టీటీడీకి కారుచౌకగా ఆవు నెయ్యి సరఫరా జరుగుతున్న వైనాన్ని బయటపెట్టింది.

తిరుమల నెయ్యి నాణ్యతపై దుమారం
తిరుమల నెయ్యి నాణ్యతపై దుమారం (image source TTD)

TTD Ghee Price Issue: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వుల అవవేషాలు వెలుగు చూశాయని, అక్రమాలు జరిగాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం ఎన్డీఏ వంద రోజుల పాలన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు. టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతపై నిర్వహించిన పరీక్షల్లో దిగ్బ్రాంతి పరిచే వాస్తవాలు వెలుగు చూసినట్టు గురువారం టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి నివేదికలను విడుదల చేశారు.

జూలై నెల మొదటి వారంలో తిరుమలలో సేకరించిన నెయ్యి శాంపిల్స్‌ ఆధారంగా గుజరాత్‌కు చెందిన నేషనల్ డైరీ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ అనుబంధ కాఫ్‌లో తిరుమలలో సేకరించిన నెయ్యి పరీక్షలు జరిపారు. దీనిపై కలవరపెట్టే విషయాలు వెలుగు చూవాయి. నెయ్యి తయారీకీ అవసరమైన ఎస్‌ వాల్యూ 95.8-104.32 శాతం మధ్య ఉండాల్సి ఉండగా టీటీడీ నుంచి సేకరించిన శాంపిల్స్‌లో 20శాతం లోపే ఉంది. జూలైలోనే ఈ నివేదిక టీటీడీకి అందింది. దీని ఆధారంగా నెయ్యి సరఫరాదారులపై టీటీడీ చర్యలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కర్ణాటక నుంచి నందిని డైరీ నుంచి నెయ్యి సరఫరాను పునరుద్దరించారు.

అసలు ఆ ధరతో నెయ్యి సరఫరా సాధ్యమేనా?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వుతో పాటు, ఇతర మార్గాల్లో కల్తీ జరిగిందని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా టీటీడీకి ప్రైవేట్ సంస్థలతో పాటు, సహకార రంగంలో ఉన్న డైరీలు అందిస్తున్న నెయ్యి ధరలను చూస్తే ఆ ధరలతో నెయ్యి సరఫరా ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం తిరుమలకు సరఫరా చేస్తున్న నెయ్యిని రూ.470 కు నుంచి కొనుగోలు చేస్తున్నారు. టెండర్లలో ఎల్‌1గా నిలచిన కంపెనీల నుంచి ఎలాంటి పరీక్షలు లేకుండా నేతిని టీటీడీ కొనుగోలు చేస్తోంది. టెండర్‌ దక్కించుకున్న సంస్థలు ఇతర ప్రాంతాల నుంచి సేకరించి వాటిని టీటీడీకీ సరఫరా చేస్తున్నట్టు ప్రైవేట్ డైరీ సంస్థలు చెబుతున్నాయి. కొన్నేళ్ల క్రితం విజయవాడ నుంచి ట్యాంకర్లలో నకిలీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేస్తుండగా టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా మాఫీ చేశారు.

ఆవు నెయ్యి తయారు చేయాలంటే ఎంత కష్టం...

సాధారణంగా ఆవు నెయ్యిని తయారు చేయాలంటే కిలో నెయ్యి తయారీకి 25 లీటర్ల నుంచి 40 లీటర్ల వరకు పాలు అవసరం అవుతాయి. పాలలో ఉండే వెన్న శాతం ఆధారంగా వెన్న లభ్యత ఉంటుంది. ఆవు పాలలో నెయ్యి శాతం గరిష్టంగా 4- 6 శాతానికి మించి ఉండే అవకాశాలు ఉండవు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఆవుల పెంపకం పెద్దగా ఉండదు. ఏపీలో చిత్తూరు, రాయలసీమ జిల్లాలో కూడా ఆవుల పెంపకం ఉంది. టీటీడీ రోజువారీ అవసరాలతో పాటు లడ్డూ ప్రసాదాల తయారీకి టన్నుల కొద్ది నెయ్యిని వినియోగిస్తారు.

దేశీయ పద్ధతుల్లో శుద్దమైన ఆవు నెయ్యిని తయారు చేయాలంటే కిలో నెయ్యికి లీటరు ఆవుపాలను లీటరుకు రూ.65రుపాయలకు కొనుగోలు చేస్తే రూ. 1625 నుంచి రూ.2275 ఉత్పత్తి వ్యయం అవుతుంది. ఒక్కోసారి కిలో నెయ్యి తయారీకి 40లీటర్ల పాలు కూడా అవసరం అవుతాయని డైరీ నిర్వాహకులు చెబుతున్నారు.  పాల సేకరణ, వెన్నను తీసి, నెయ్యి తయారు చేసే క్రమంలో ఉత్పత్తి దారుడికి అయ్యే ఖర్చును కలుపుకుంటే లీటరు ధర వెన్న శాతం ఆధారంగా కిలో నెయ్యి ధర రూ.2వేలకు తక్కువ ఉండదు. అత్యంత ఖరీదైన ఆవు నెయ్యిని ఎల్‌1 టెండర్‌లో గత ప్రభుత్వ హయంలో సగటున రూ.400కు కేటాయించారు. ప్రస్తుతం నందిని సంస్థ నుంచి రూ.470  కొనుగోలు చేస్తున్నారు. 

అంత ఖరీదైన ఆవునెయ్యిని టన్నులకు టన్నులు టీటీడీకి రూ.450-500 ఎలా సరఫరా చేయగలుగతారనే ప్రశ్నకు సహేతుకమైన సమాధానాలు ఎవరి వద్ద లేవు. సీఎం ఆరోపణల నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన వివరణలో కూడా కొన్ని వివరాలు బయటపెట్టారు.

శ్రీవారి నైవేధ్యాల కోసం నిత్యం 60కేజీల స్వచ్ఛమైన నెయ్యిని దాతల సహకారంతో గుజరాత్, రాష్ట్రాల్లోని గోశాల నుంచి లక్ష రుపాయల వ్యయంతో కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. రోజుకు 60కిలోలను లక్ష రుపాయల చొప్పున నెలకు రూ.30లక్షలు ఖర్చు చేస్తున్నట్టు సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు. ఆ లెక్కల్లో కిలో ధర రూ.1667 పలుకుంది. స్వామి వారి నైవేధ్యానికి వినియోగించే నెయ్యి ధర రూ.1667 ఉన్నపుడు, లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి కిలో రూ.470కు ఎలా వస్తుందనేది మరో ప్రశ్న. స్వామి వారి నైవైధ్యాలలో వాడే నెయ్యి, ప్రసాదాల్లో వాడే నెయ్యి ఒక్కటి కాదని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా అంగీకరించినట్టైంది.

ధరల మాయజాలం ఎక్కడుంది?

వైసీపీ ప్రభుత్వంలో ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసే నెయ్యిని ట్యాంకర్లలో సరఫరా చేస్తే కిలో రూ.390కు, 15లీటర్ల క్యాన్లలో కొనుగోలు చేస్తే రూ.409 చొప్పున సేకరించారు. సగటున రూ.400 చొప్పున కిలో నెయ్యి కొనుగోలు చేశారు.

గత ఏడాది టీటీడీ నెయ్యి కొనుగోళ్ల కోసం రూ.207 కోట్లన ఖర్చు చేసింది.  కిలో రూ.400చొప్పున ఏడాదిలో దాదాపు 51,75,000 కేజీల నెయ్యిని పలు సంస్థల నుంచి కొనుగోలు చేశారు. అంటే సగటున రోజుకు 14,178కేజీల నెయ్యిని ప్రసాదాల తయారీలో వినియోగించారు.  ఇందుకోసం 5175 టన్నుల నెయ్యిని రూ.207 కోట్లను టీటీడీ వెచ్చించింది. 

ఎవరికి లాభం...?

టీటీడీకి సరఫరా చేసే నెయ్యి కల్తీ వ్యవహారంలో పైకి కనిపించని కోణాలు చాలా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దేశంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభ్యత అంత సులువు కాదని డైరీ రంగంలో పనిచేసే వారు చెప్పే మాట... రాయలసీమలో ఆవుల ద్వారా పాడిపరిశ్రమ నిర్వహించే డైరీ నిర్వాహకులు గతంలో టీటీడీని నెయ్యి సరఫరాకు సంప్రదించినా అప్పట్లో తమకు అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు.

దేశంలో కర్ణాటక డైరీ ఫెడరేషన్‌తో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రమే ఆవుపాలను సేకరించి ఉత్పత్తులు చేస్తున్నాయి. 4 నుంచి 6శాతం మాత్రమే కొవ్వు ఉండే ఆవు పాల నుంచి నెయి తీయాలంటే 15 టన్నుల నెయ్యి కోసం 6 లక్షల లీటర్ల పాలు వాడాల్సి ఉంటుందని డైరీ నిర్వాహకులు చెబుతున్నారు. అంటే సగటున ప్రతి కిలో నెయ్యికి 40లీటర్ల పాలు వినియోగించాల్సి ఉంటుంది.  టీటీడీ లడ్డూ ప్రసాదాల కోసం కొనే నెయ్యిలో ఖచ్చితంగా కల్తీ జరగడానికి అవకాశం ఉంటుందని చిత్తూరుకు చెందిన ప్రైవేట్ డైరీ నిర్వాహకుడు వివరించారు.

లాభమా నష్టమా...?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలపై చేసిన వ్యాఖ్యల్లో లాభనష్టాలపై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయ కోణంలో చూస్తే గత ప్రభుత్వాల హయంలో జరిగిన పొరపాట్లు తమకు చుట్టుకోకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారనే వాదనలు ఉన్నా, అంతకు మించి భక్తుల మనస్సులో సందేహాలను నాటాయి. ఇకపై తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులు అనుమానపు చూపులు చూసే ప్రమాదం ఉంటుంది.

ఆవుకొవ్వు, పందికొవ్వు అంటూ రాజకీయ వ్యాఖ్యలు స్వామి వారి లడ్డూ ప్రసాదాలపై సామాన్య ప్రజల్లో ఉండే భక్తిభావంపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు గుజరాత్‌ ల్యాబరేటరీ రిపోర్టులను బయటపెట్టకపోతే భవిష్యత్తులో వైసీపీ వాటినే తమపై ప్రయోగించి ఉండేదనే అనుమానం టీడీపీ వర్గాల్లో ఉంది. కోట్లాది మంది భక్తుల కొలిచే కలియుగ ప్రత్యక్ష దైవం చుట్టూ ఏపీలో జరుగుతున్న రాజకీయం భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా సాగుతోంది.

తిరుమల వెళ్లిన భక్తుల్ని ఇతరులు దేవుడి కంటే ముందు లడ్డూ ప్రసాదం గురించే అడుగుతారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపడానికి ఉపయోగపడినా  భక్తుల హృదయాల్లో అంతకుమించి అనుమానపు బీజాలు నెలకొల్పడానికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కారణమవుతాయనే అభిప్రాయం ఉంది. 

Whats_app_banner

సంబంధిత కథనం