Miss South India : మిస్ సౌత్ ఇండియా కిరీటం గెలుచుకున్న వైజాగ్ అమ్మాయి గురించి తెలుసా?
అందాల పోటీల్లో ఆంధ్రా అమ్మాయి కిరీటం సొంతం చేసుకుంది. ఇటీవల కేరళలోని కొచ్చిలో జరిగిన మిస్ సౌత్ ఇండియా (Miss South India) పోటీల్లో విశాఖ అమ్మాయి విజయం సాధించింది. తనే.. ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న చరిష్మా కృష్ణ.
Miss South India 2022 : మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న చరిష్మా విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో చదువుతోంది. ఇటీవలే.. పెగాసస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొన్న చరిష్మా.. దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల యువతులతో పోటీ పడి టైటిల్ కైవసం చేసుకుంది. ఓ వైపు చదువును కొనసాగిస్తూనే మరోవైపు తాను ఎంచుకున్న రంగంలో రాణిస్తోంది. డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది చరిష్మా. ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా ఎదిగింది. ఇటీవల కొచ్చిలో జరిగిన అందాల పోటీలో విజేతగా నిలిచింది. మిస్ సౌత్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.
చరిష్మా తండ్రి అమెరికాలో ఉండేవారు. అక్కడే ఆమె ఐదో తరగతి పూర్తి చేసింది. తరువాత కుటుంబం వైజాగ్‌కు తిరిగి వచ్చింది. ఆమె ఆరో తరగతి నుండి ఇక్కడే చదువుకుంది. చరిష్మా చదువుతో పాటు భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. ఇప్పటి వరకు దాదాపు 30 ప్రదర్శనలు ఇచ్చింది. స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ అంటే ఆమెకి ఇష్టం. చరిష్మా నటిగా మారేందుకు శిక్షణ కూడా తీసుకుంది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.
కిందటి ఏడాది విశాఖపట్నంలో జరిగిన మిస్ వైజాగ్ అందాల పోటీల్లో పాల్గొని.. మూడో స్థానంలో నిలిచింది. కేరళలో పెగాసస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది యువతులతో పోటీపడి 'మిస్ సౌత్ ఇండియా' కిరీటాన్ని గెలుచుకుంది.
చరిష్మా అంతకుముందు చాలా డ్యాన్స్ షోలలో పాల్గొంది. 2016లో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చరిష్మాకు డ్యాన్స్ చేసే అరుదైన అవకాశం కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసింది చరిష్మా. ఆదివాసీ బాపిరాజు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఇచ్చే ఉగాది ప్రతిభా అవార్డును కూడా అందుకుంది.