Chandrababu Petitions: ఏసీబీ కోర్ట్ నుంచి సుప్రీం వరకు బాబు పిటిషన్లపై నేడు విచారణ-hearing on chandrababus petitions from acb court to supreme court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Petitions: ఏసీబీ కోర్ట్ నుంచి సుప్రీం వరకు బాబు పిటిషన్లపై నేడు విచారణ

Chandrababu Petitions: ఏసీబీ కోర్ట్ నుంచి సుప్రీం వరకు బాబు పిటిషన్లపై నేడు విచారణ

Sarath chandra.B HT Telugu
Oct 09, 2023 07:09 AM IST

Chandrababu Petitions: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి నెల దాటిపోయింది. పలు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగనుండగా స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌ సుప్రీం కోర్టు ముందుకు రానుంది. విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ జరుగనుంది.

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ
సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ

Chandrababu Petitions: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తరపున దాఖలైన పిటిషన్లపై నేడు విచారణ జరుగనుంది. విజయవాడ ఏసీబీ కోర్టు మొదలుకుని సుప్రీం కోర్టు వరకు పలు పిటిషన్లపై నేటి విచారణ కీలకం కానుంది. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు సోమవారం వెలువడనున్నాయి.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించి సీఐడీ పై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగనుంది. హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలను సమర్పించాలని గత వారం సుప్రీం కోర్టు ఏపీప్రభుత్వాన్ని ఆదేశించింది.

స్కిల్‌ కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారం నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతోపాటు మరోసారి 'పోలీసు కస్టడీ'కి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ రెండు పిటిషన్లపై గత శుక్రవారమే ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి.

రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను రిజర్వు చేశారు. ఈ తీర్పులు కూడా నేడు వెలువడనున్నాయి. మూడు పిటిషన్లపై న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీ సుప్రీంకోర్టు ముందు సోమవారం విచారణకు రానుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. అక్టోబర్ 3న ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించి, విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.

సోమవారం మధ్యాహ్నం ఈ కేసు విచారణకు రానుంది. గత వారం విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థలూథ్రాలు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఎ సెక్షన్‌ను అనుసరించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై కేసు నమోదు చేసేటప్పుడు గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. 2017లోనే కేసు విచారణ ప్రారంభమైందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. 2018లో 17ఎ సెక్షన్‌ రాకముందే ప్రారంభమైనందున గవర్నర్‌ అనుమతి అవసరం లేదని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు.

ఏపీ హైకోర్టు కూడా తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. అయితే ధర్మాసనం ఆ పత్రాలను తమకు సమర్పించాలని చెబుతూ కేసును వాయిదా వేసింది. రాష్ట్రప్రభుత్వ అధికారులు పత్రాలు సమర్పించడంతో సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు సెక్షన్ 17ఏలో ప్రజా ప్రతినిధులకు మినహాయింపుపై సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన వ్యాజ్యం పెండింగ్‌లో ఉంది. నవంబర్ 20వ తేదీన ఈ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారింది. ht

Whats_app_banner