Guntur Police : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు.. పోలీసులపైనా చర్యలు!-guntur sp satish kumar said that 110 people have been identified in the case of attack on tdp office ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur Police : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు.. పోలీసులపైనా చర్యలు!

Guntur Police : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు.. పోలీసులపైనా చర్యలు!

Basani Shiva Kumar HT Telugu
Sep 17, 2024 03:18 PM IST

Guntur Police : టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రోజుకో అప్‌డేట్ వస్తోంది. ఇటీవల వైసీపీ కీలక నేతలను విచారణకు పిలిచిన పోలీసులు.. తాజా మరో అప్‌డేట్ ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మందిని గుర్తించినట్టు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో పోలీసులపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 110 మందిని గుర్తించినట్టు ఎస్పీ సతీష్‌కుమార్‌ వెల్లడించారు. అరెస్ట్‌ చేయొద్దంటూ చాలా మంది కోర్టు కెళ్లారని.. మినహాయింపు పొందిన వారిని త్వరలోనే విచారణకు పిలుస్తామని స్పష్టం చేశారు. పోలీస్ విచారణలో నందిగం సురేష్ సహకరించారన్న ఎస్పీ.. సురేష్ చెప్పిన సమాధానాలను క్రాస్ చెక్ చేసుకుంటామని వ్యాఖ్యానించారు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ సతీష్‌కుమార్‌ స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టులో ఊరట..

ఇటీవల సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్‌కు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. పాస్‌పోర్టులను 48 గంటల్లో అప్పగించాలని ఆదేశించింది. విచారణకు పూర్తిగా సహకరించాలని సూచించింది. మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌పై విచారణను వాయిదా వేసింది. దీంతో అవినాష్, జోగి రమేష్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినట్టు అయ్యింది.

విచారణకు వైసీపీ నేతలు..

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇటీవల వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌, తలశిల రఘురామ్‌, లాయర్ గవాస్కర్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అయితే.. వైసీపీ నేతలు విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఏ ప్రశ్నలు అడిగినా.. తెలియదు, గుర్తులేదు అంటూ దాటవేత ధోరణి ప్రదర్శి,స్తున్నారని తెలుస్తోంది. దీంతో విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల చేతికి పాస్‌పోర్ట్‌లు..

అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస రావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో వైసీపీ నేతలను విచారించారు. ఈ విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ నేతలు తమ పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించారు. దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ పాస్‌పోర్ట్ అప్పగించగా.. లేళ్ల అప్పిరెడ్డికి పాస్‌పోర్ట్ లేదని చెప్పినట్టు తెలిసింది. ఇటు జోగి రమేష్ పాస్‌పోర్ట్ గడువు ముగిసిందని.. చెప్పినట్టు సమాచారం. రెన్యువల్ చేయించాక పోలీసులకు అప్పగిస్తామని జోగి రమేష్ చెప్పినట్టు తెలిసింది.

అవినాష్‌పై సీరియస్..

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగి దాడి ఘటనల్లో.. దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్‌ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్‌ నిందితుడిగా ఉన్నారు. మూడేళ్ల కిందట మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసంలో అవినాష్‌ నడిపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.