Janasena vs TDP: మచిలీపట్నంలో ఘోరం.. జనసేన నాయకుడిపై టీడీపీ నేతల దాడి, బలవంతంగా కాళ్లు పట్టించుకున్న వైనం-terrible in machilipatnam janasena leader attacked by tdp leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Vs Tdp: మచిలీపట్నంలో ఘోరం.. జనసేన నాయకుడిపై టీడీపీ నేతల దాడి, బలవంతంగా కాళ్లు పట్టించుకున్న వైనం

Janasena vs TDP: మచిలీపట్నంలో ఘోరం.. జనసేన నాయకుడిపై టీడీపీ నేతల దాడి, బలవంతంగా కాళ్లు పట్టించుకున్న వైనం

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 10, 2024 01:27 PM IST

Janasena vs TDP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య తలెత్తిన వివాదంలో టీడీపీ నాయకుడు అనుచితంగా ప్రవర్తించాడు. ప్రత్యర్థి ఇంటిపై దాడి చేసి వారితో బలవంతంగా కాళ్లు పట్టుకోపోతే హతమారుస్తామని బీతావహుల్ని చేశారు. వాటిని వీడియోలు తీసి వైరల్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మచిలీపట్నంలో దారుణం, జనసేన నాయకులతో  కాళ్లు పట్టించుకున్న టీడీపీ నాయకుడు
మచిలీపట్నంలో దారుణం, జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకున్న టీడీపీ నాయకుడు

Janasena vs TDP: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జనసేన నాయకుడిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. బ్యానర్ ఏర్పాటు చేసిన విషయంలో జనసేన నేతల మధ్య తలెత్తిన చిన్న వివాదంలో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుని జనసేన నాయకుడిపై దాడికి పాల్పడ్డారు.

మచిలీపట్నంలో యర్రంశెట్టి నాని అనే స్థానిక జనసేన నాయకుడు ఇటీవల ఓ బ్యానర్ ఏర్పాటు చేయడంతో అదే పార్టీకి చెందిన కర్రి మహేష్‌‌తో వివాదం ఏర్పడింది. బ్యానర్‌ ఏర్పాటు విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదంతో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో ఆ వివాదం సద్దుమణిగి పోయిందని బాధితుడు నాని చెబుతున్నారు.తమ మధ్య వివాదం జరిగిన సమయంలో టీడీపీకి చెందిన శంకు శీను అక్కడే ఉన్నాడని, గొడవ తర్వాత ఇంటికి వస్తుండగా తనపై శీను వర్గం తనపై దాడి చేశారని చెబుతున్నారు.ఈ దాడిలో తలకు గాయాలైన నాని తన బావ ఇంట్లో తలదాచుకున్నారు.

ఆదివారం రాత్రి జరిగిన వివాదం నేపథ్యంలో శంకుశీను మేనళ్లుతో కలిసి తాను ఉంటున్న ఇంటిపై దాడి చేసినట్టు బాధితుడు ఆరోపించారు. ఇంట్లో ఉన్న టీవీలు ఫర్నిచర్‌ ధ్వంసం చేశారని తెలిపారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన బావ శాయన శ్రీనివాసరావుపై తీవ్రంగా దాడి చేయడంతో పాటు కాళ్లు పట్టుకోకపోతే ప్రాణాలతో మిగలవని బెదిరించి ఇంట్లో ఉన్న వారందరితో శంకు శీను కాళ్లు పట్టించారని వాపోయారు. అప్పటికే తీవ్రంగా గాయపడి ఉన్నా తనపై దాడి చేశారని బాధితుడు వాపోయాడు.

కర్రి మహేష్‌కు చెందిన బ్యానర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చింపారని ఆ వివాదంతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. స్థానికేతరుడిననే కారణంతో తనను బెదిరించారని, ఒకే పార్టీకి చెందిన నాయకులు కావడంతో తానే వెనక్కి తగ్గానని వివరించారు. ఆదివారం జరిగిన దాడిలో గాయపడిన తర్వాత అక్వా కంపెనీలో ఉద్యోగం చేసే తన బావ ఇంట్లో ఆశ్రయం పొందుతుండగా సోమవారం మధ్యాహ్నం తమపై టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి ఇంట్లో విధ్వంసం సృష్టించారని చెప్పారు.

వివాదంతో సంబంధం లేని టీడీపీ...

జనసేన నాయకులు మధ్య తలెత్తిన వివాదంలో టీడీపీ నాయకుడు ఎందుకు జోక్యం చేసుకున్నారనేది మిస్టరీగా మారింది. జనసేన నాయకుడిపై దాడి చేసిన శంకు శీను గతంలో వైసీపీలో ఉండేవారు. ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. తాజాగా దాడి ఘటనలో బాధితుల్ని విచక్షణారహితంగా దాడి చేసి కాళ్లు పట్టుకోకపోతే హతమారుస్తానని, ముఖంపై మూత్రం పోస్తానని బెదిరింపులకు పాల్పడటం కనిపించింది.

జనసేన నాయకుడిపై జరిగిన దాడిలో మరో జనసేన నాయకుడు కూడా ఉండటం గమనార్హం. ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మచిలీపట్నం జనసేన ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీ లో చేరారు. బందరు పార్లమెంటు స్థానాన్ని ఆశించిన నేతలకు రాజకీయ పొత్తులో టిక్కెట్లు దక్కలేదు.

తాజాగా టీడీపీ-జనసేననాయకుల మధ్య జరిగిన వివాదం, కాళ్లు పట్టించుకున్న వైనం ఎటూ దారి తీస్తుందో చూడాలి. ఈ అంశాన్ని ఇరు పార్టీలు ఎలా పరిష్కరిస్తాయో చూడాలి. రాజకీయ విభేదాలతో దాడులకు పాల్పడటమే దారుణం అనుకుంటే బలవంతంగా కాళ్లు పట్టించుకోవడం, వాటిని వీడియోలు తీసి ఆధిపత్యం ప్రదర్శించడానికి వైరల్ చేయడాన్ని ఉపేక్షిస్తే ఇరు పార్టీలు నష్టపోవచ్చు.