Attack on Chandrababu House : అజ్ఞాతంలోకి జోగి రమేష్.. హైదరాబాద్‌లో గాలిస్తున్న ఏపీ పోలీసులు!-ap police search in hyderabad for ex minister jogi ramesh in case of attack on chandrababu house ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Attack On Chandrababu House : అజ్ఞాతంలోకి జోగి రమేష్.. హైదరాబాద్‌లో గాలిస్తున్న ఏపీ పోలీసులు!

Attack on Chandrababu House : అజ్ఞాతంలోకి జోగి రమేష్.. హైదరాబాద్‌లో గాలిస్తున్న ఏపీ పోలీసులు!

Basani Shiva Kumar HT Telugu
Sep 05, 2024 11:43 AM IST

Attack on Chandrababu House : ఏపీ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా మాజీమంత్రి జోగి రమేష్ కోసం వెతుకున్నట్టు సమాచారం. ఆయనకు ఏపీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.

మాజీమంత్రి జోగి రమేశ్
మాజీమంత్రి జోగి రమేశ్

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఈ నిర్ణయం తీసుకునే ఒకరోజు ముందే.. జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

ప్రత్యేక బృందాల గాలింపు..

జోగి రమేష్ హైదరాబాద్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లినట్టు సమాచారం. జోగి రమేష్‌, ఆయన అనుచరుల కోసం హైదరాబాద్‌కు ప్రత్యేక బృందాలు వెళ్లినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్నవారి కోసం గాలిస్తున్నట్టు ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. అటు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణకు జోగి రమేష్..

చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో జోగి రమేశ్‌ ఇటీవల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు.. జోగి రమేశ్‌ తన న్యాయవాదితో కలిసి వెళ్లారు. దాడి రోజు జోగి రమేశ్‌ వినియోగించిన సెల్​ఫోన్, వాహనాల వివరాలను పోలీసులకు అందజేశారు. తాను నిరసన తెలియజేసేందుకు వెళ్లానని.. ఎలాంటి దాడికి ప్రయత్నించలేదని జోగి రమేశ్‌ స్పష్టం చేశారు.

2021లో దాడి..

2021లో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్‌, ఆయన అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ జోగి రమేశ్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు.​ ఆ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు ఇటీవలే డిస్మిస్ చేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

వైసీపీ స్పందన..

అటు మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై వైసీపీ స్పందించింది. 'వరద విపత్తులోనూ కూటమి ప్రభుత్వం బురద రాజకీయం చేస్తోంది. మాజీ ఎంపీ, దళిత నాయకుడు నందిగం సురేష్‌ని అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. విజయవాడలో వరద బాధితుల హాహాకారాలు పట్టించుకోకుండా.. కక్ష సాధింపు రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. వరద విలయతాండవం చేసిన సింగ్‌ నగర్‌లో బాధితులకి నిన్నటి వరకు సాయం చేసిన.. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త‌ అవుతు శ్రీనివాస రెడ్డిని కూడా అరెస్ట్ అయ్యారు. ఈ క్లిష్ట సమయంలో వరద బాధితులకి సాయంగా ఉండాల్సిన పోలీసుల్ని.. ఇలా స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటారా' అని వైసీపీ ప్రశ్నించింది.

Whats_app_banner