AP Liquor Shops : ప్రభుత్వ మద్యం షాపులు రద్దు..! ఆర్డినెన్స్ జారీ
ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ అయింది. రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.
నూతన మద్యం పాలసీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రిటైల్ షాపులకు అనుమతిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. త్వరలోనే కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది.
ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో నూతన మద్యం పాలసీకి ఆమోదముద్ర పడిన సంగతి తెలిసిందే. కొత్త మద్యం పాలసీపై సుదీర్ఘంగా మంత్రివర్గం చర్చించింది. ఎన్నికల హామీ మేరకు నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
ప్రైవేట్ మద్యం దుకాణాల వైపే కొత్త లిక్కర్ పాలసీ మొగ్గు చూపింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అమలు తీసుకు రానున్నట్టు మంత్రి వర్గ ఉపసంఘం కూడా ప్రకటించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుడుతున్నట్టు మంత్రులు ప్రకటించారు.
5-6 పరీక్షలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. గత ప్రభుత్వ పాలసీపై జరుగుతున్న విచారణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి మద్యం షాపులు కేటాయించనున్నారు. గత ప్రభుత్వ మద్యం పాలసీ ఈ సెప్టెంబర్ తో క్లోజ్ అవుతుంది.