Budameru Floods: వరద ముంపు బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం..వారి నిర్లక్ష్యమే నిలువునా ముంచింది..
Budameru Floods: విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు వరదలకు అసలు కారణం అధికారుల నిర్లక్ష్యమేనని ప్రభుత్వం గుర్తించింది. విపత్తు ముంచుకొచ్చిన సమయంలో యంత్రాంగం మీనమేషాలు లెక్కించడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఏపీ ప్రభుత్వ పెద్దలు గుర్తించారు.
Budameru Floods: విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదల వెనుక అధికారుల నిర్లక్ష్యం క్రమంగా బయటపడుతోంది. ఆగస్టు 30వ తేదీ రాత్రి నుంచి 31వ తేదీ అర్థరాత్రి వరకు కురిసిన వర్షంతో వెలగలేరు డైవర్షన్ స్కీమ్ ఎగువున ప్రవాహం పోటెత్తింది. బుడమేరు ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నట్టు 31వతేదీ మధ్యాహ్నానికి ఇరిగేషన్ అధికారులు గుర్తించారు.
బుడమేరు ఎగువున ఎంత వర్షపాతం కురుస్తుందో, ఎంత ప్రవాహం దిగువకు లెక్కిస్తుందో టెలిమెట్రి వ్యవస్థ అందుబాటులో లేదు. మండల స్థాయిలో వర్షపాతాన్ని నమోదు చేసే వ్యవస్థలు ఉన్నా బుడమేరు పరివాహక ప్రాంతానికి వస్తున్న ప్రవాహాలను అంచనా వేసే పరిజ్ఞానం జలవనరుల శాఖ వద్ద అందుబాటులో లేదు.
విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తడానికి ప్రకృతి విపత్తుతో పాటు మానవ వైఫల్యం కూడా ఉందని ఇప్పటికే ఉన్నత స్థాయిలో అధికారులు గుర్తించారు. 31వ తేదీ విజయవాడలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ఐఎండి అంచనాలు, విపత్తు హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన కూాడా రద్దు చేసుకున్నారు. ఆగస్టు 31వ తేదీ మధ్యాహ్నానికి ముఖ్యమంత్రి హైదరాబాద్ బయలుదేరాల్సి ఉంది.
భారీ వర్షం కారణంగా జాతీయ రహదారులన్నీ అప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ బెంజిసర్కిల్ నుంచి కేసరపల్లి వరకు జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్లు, ట్రావెల్స్ బస్సులు నీటిలో నిలిచిపోయాయి.
బెంజిసర్కిల్ మొదలుకుని మహానాడు జంక్షన్, రామవరప్పాడు రింగ్, ఎనికేపాడు వరకు జాతీయ రహదారులపై పలు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వరదలు, కృష్ణా నదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తాయనే హెచ్చరికలు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 31వ తేదీ శనివారం తన హైదరాబాద్ పర్యటన వాయిదా వేసుకుని ఉండవల్లిలోనే ఉండిపోయారు.
31వ తేదీ మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో చర్చించారు. 31 మధ్యాహ్నం సిఎం హైదరాబాద్ వెళ్లిపోతారనే సమాచారంతో ముఖ్యమైన అధికారుల్లో కొందరు హైదరాబాద్ వెళ్లిపోయారు. అదే రోజు మధ్యాహ్నం జలవనరుల శాఖ అధికారులు వరద సమాచారాన్ని ప్రభుత్వానికి చెరవేశారు. వరదలపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అధికారుల వరకు వరద సమాచారం చేరనట్టు తెలుస్తోంది.
కట్టలు తెగిన వరద…
బుడమేరుప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఉన్న డైవర్షన్ స్కీమ్‌లో 31వ తేదీ మధ్యాహ్నానికి గరిష్ట స్థాయిలో వరద ప్రవాహం చేరింది. డైవర్షన్ ఛానల్ నుంచి కృష్ణా నదిలోకి వరద నీరు వెళ్లేలా దాని సామర్ధ్యం లేదు. 31-1 వ తేదీల్లో రికార్డు స్థాయిలో కురిసిన వర‌్షపాతంతో బుడమేరు పరివాహక ప్రాంతంలో వాన నీటితో నిండిపోయింది.
ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 3వ తేదీల మధ్య రెడ్డిగూడెం మండలంలో 32 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మైలవరంలో 45 సెంటిమీటర్లు, జికొండూరులో 56.35 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత వర్షపాతాన్ని తట్టుకునే సామర్ధ్యం బుడమేరు డైవర్షన్ స్కీమ్‌కు లేదు.
బుడమేరు పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షంతో బుడమేరు గట్లు తెగిపోయి ఆ వరద ప్రవాహం విజయవాడపై విరుచుకుపడింది. బుడమేరులో నీటి ప్రవాహం పెరుగుతోందని 31వ తేదీ మధ్యాహ్నమే ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.
గత చరిత్ర మొత్తం విధ్వంసమే…
ఉమ్మడి కృష్ణా జిల్లా-ఖమ్మం జిల్లాల మధ్య ప్రవహించే బుడమేరు గతమంతా విధ్వంసమే. స్వాతంత్ర్యానికి ముందు నుంచి బుడమేరు ముంపు నుంచి కాపాడాలని రైతులు పోరాటాలు చేసిన చరిత్ర ఉంది. రైతుల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఆంధ్ర రాష్ట్రంలో బుడమేరు ఆనకట్ట నిర్మాణం ప్రతిపాదనలు జరిగాయి.
ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా ఎ. కొండూరు మండలంలోని జమ్ములవోలు దుర్గంలోని కొండశ్రేణిలో ఒక పాయ, రెడ్డిగూడెం మండలం అన్నరావుపేట కొండ శ్రేణుల నుంచి మరో పాయుగా పుట్టి నందిగామకు దక్షిణంగా రెండూ కలిసి బుడమేరు వాగుగా ఏర్పడతాయి.
జిల్లాలోని ఏ కొండూరు. రెడ్డిగూడెం, మైలవరం.. కొండూరు, విస్సన్నపేట మండలాల్లో పరీవాహర ప్రాంతం ఉంది. వరదలు లేని సమయంలో బుడమేరు కింద పంట పొలాలు కూడా సాగు చేస్తారు. పశ్చిమ కృష్ణాలో బుడమేరు నీటితో వ్యవసాయం కూాడ జరుగుతోంది. కోతులవాగు, పులివాగుల ద్వారా వర్షకాలంలో వరద నీరంతా కలిసి బుడమే రులో కలిసి వెలగలేరు వద్దకు చేరుతుంది.
ఫ్లష్ ఫ్లడ్స్‌తో కనీవిని ఎరుగని ముప్పు…
ఐఎండి జారీ చేసిన బులెటిన్‌లలో భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు ఉండటంతో వాటిని సాధారణంగానే ఇరిగేషన్ అధికారులు భావించారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షపాతంతో ప్రమాదం జరగొచ్చని భావించిన బుడమేరు డివిజన్ ఇరిగేషన్ అధికారులు అధికారికంగా ఎస్‌ఈకి, అక్కడి నుంచి ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)కు సమాచారాన్ని చేరవేశారు.
వరదల సమయంలో అనుసరించాల్సిన స్టాండర్ట్ ప్రోసిజర్‌ను పాటించినట్టు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. జలవనరుల శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది రెవెన్యూ అధికారులకు బుడమేరుకు వరద రావొచ్చనే సమాచారాన్ని కూడా చేరవేశారు. వరద ప్రవాహం గట్టు తెగడానికి ముందే క్షేత్ర స్థాయి అధికారులు బాధ్యుల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.
ఆగస్టు 31న మధ్యాహ్నం 2 గంటలకు వెలగలేరు వద్ద ఉన్న పరిస్థితులపై వెలగలేరు రెగ్యులేటరీ వద్ద ఉన్న పరిస్థితులపై జలవనరుల శాఖ ప్రత్యేక 'ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. వెలగలేరు రెగ్యులేటర్ లాకుల మీదుగా పొంగుతున్న వరద గురించి జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. మధ్యాహ్నం 3 గంటలకు వెలగలేరు రెగ్యులేటరీ లాకులు తెరవబోతున్నట్లు కలెక్టర్‌కు సమాచారమి చ్చారు. అప్పటికే వెలగలేరు వద్ద వరద తీవ్రత పెరిగింది. గేట్లు తెరిచినా, దాని మీదుగా వరద ప్రవాహం కొనసాగినట్టు ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
31వ తేదీ శనివారం మద్యాహ్నం 3.30కు కృష్ణా ఇరిగేషన్ ఎస్ఈ గంగయ్య కలెక్టర్‌తో సమావేశమై నగరానికి ముంపు ప్రమాదముందని, విజయవాడ కార్పొరేషన్ అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు. అదే రోజు సాయంత్రం వరదలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
సమన్వయ లోపమే శాపంగా మారింది…
30వ తేదీ రాత్రి మొదలైన వర్షం 31 వ తేదీన కూడా కొనసాగింది. 31వ తేదీ మధ్యాహ్నం నుంచి చీఫ్ సెక్రటరీ, హోంమంత్రి అనిత ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌ను తన కార్యాలయంగా మార్చుకున్నారు. 31వ తేదీ రోజంతా విజయవాడలో కొండ చరియలు విరిగిపడటం, భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అన్ని శాఖల అధికారులు విజయవాడను ముంచెత్తిన వర్షంలో మునిగిన సమయంలో ఎగువున వెలగలేరు కట్టలు తెగిపోయాయి.
వెలగలేరు నుంచి ముప్పు పొంచి ఉందనే విషయాన్ని ఇరిగేషన్ అధికారులు సకాలంలో ప్రభుత్వానికి చేరవేసినా విజయవాడ నగరంలో ఉన్న పోలీసులు, రెవిన్యూ, కీలక అధికారులు నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేశారు. విజయవాడ వరదలంటే కృష్ణా నదిని మాత్రమే పరిగణలోకి తీసుకుని బుడమేరు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. మరోవైపు విజయవాడ కలెక్టరేట్ కేంద్రంగా వరదలు,తుఫాను పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు 1వ తేదీ ఆదివారం నుంచి పనిచేస్తారని తెలియడంతో సంబంధిత అధికారులు వరద ముప్పు సంగతి మర్చిపోయారు.
వెలగలేరు ఎగువున వచ్చే వరద ప్రవాహాన్ని గుర్తించే ఏర్పాట్లు లేకపోవడంతో నగరంలోకి వరద ప్రవాహం పోటెత్తింది. కృష్ణానదిలో 24 అడుగుల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది. వెలగలేరు కాల్వ నుంచి నదిలోకి నీరువెళ్లే అవకాశం లేకపోవడంతో బలహీనంగా ఉన్న కట్టలు తెగిపోయాయి.
ఆ అధికారులపై చర్యలు తప్పవా?
బుడమేరు ముంపు విషయంలో పలువురు అధికారులపై చర్యలు తీసుకోడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. దాదాపు ఎనిమిది మంది అధికారులను బాధ్యులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల వైఫల్యంపై ఇప్పటికే నివేదిక ముఖ‌్యమంత్రికి చేరిందమి. లక్షలాది మందిని నిరాశ్రయులు కావడంతో పాటు కనివిని ఎరుగని విపత్తును గుర్తించడంలో విఫలమైన అధికారులను పక్కన పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం వరద సహాయ చర్యల్లో నిమగ్నమై ఉండటంతో, పరిస్థితి చక్కబడిన తర్వాత బాధ్యులపై వేటు పడుతుందని చెబుతున్నారు. బుడమేరు వరదల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై 2011లోనే స్టాండర్డ్ ప్రోసిజర్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, విజయవాడ పోలీస్ కమిషనరేట్, ఫైర్ , డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవిన్యూ, అగ్రికల్చర్ శాఖల మధ్య సమన్వయంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఖరారు చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత బుడమేరుకు ఈ స్థాయిలో వరదలు రాకపోవడం, ప్రభుత్వ శాఖల్లో అనుభవం లేని అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం వంటి కారణాలు విపత్తుకు కారణం అయ్యాయి. సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, వరద ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయకపోవడం, అంతా నిద్రలో ఉండగా నీట మునిగి అపార నష్టం వాటిల్లింది.
మరోవైపు ఇరిగేషన్ ఇంజినీర్లు సరైన సమయానికే వెలగలేరు షట్టర్లు ఎత్తారని రెగ్యులేటర్ల నిర్వహణ పట్టించుకోలేదని ఇరిగేషన్ అధికారుల ప్రాథమికనివేదికలో పేర్కొన్నారు. మొత్తంగా బుడమేరు వరద ముంపు అధికారుల వైఫల్యమేనని, నిర్ణయం తీసుకోవాల్సిన స్థాయిలో ఉన్న అధికారుల ఉదాసీనతే నగరాన్ని ముంచిందని తెలుస్తోంది.
సంబంధిత కథనం