Pattiseema Water: పట్టిసీమ లిఫ్ట్‌తో గోదావరి జలాల తరలింపు ప్రారంభం, కృష్ణాడెల్టాకు ఊరట, కృష్ణా బేసిన్‌లో నీటి కొరత..-godavari water pumping begins with pattiseema lift relief to krishna delta ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pattiseema Water: పట్టిసీమ లిఫ్ట్‌తో గోదావరి జలాల తరలింపు ప్రారంభం, కృష్ణాడెల్టాకు ఊరట, కృష్ణా బేసిన్‌లో నీటి కొరత..

Pattiseema Water: పట్టిసీమ లిఫ్ట్‌తో గోదావరి జలాల తరలింపు ప్రారంభం, కృష్ణాడెల్టాకు ఊరట, కృష్ణా బేసిన్‌లో నీటి కొరత..

Sarath chandra.B HT Telugu
Jul 03, 2024 08:18 AM IST

Pattiseema Water: కృష్ణా డెల్టా రైతుల సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. గోదావరి జలాలు కృష్ణా నదివైపు పరుగులు ప్రారంభించాయి. పట్టిసీమ లిఫ్ట్‌‌ను మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం ప్రారంభించారు.

పట్టిసీమ మోటర్లను ప్రారంభిస్తున్నమంత్రి నిమ్మల రామానాయుడు
పట్టిసీమ మోటర్లను ప్రారంభిస్తున్నమంత్రి నిమ్మల రామానాయుడు

Pattiseema Water: ఓవైపు ఆశాజనకంగా లేని వర్షాలు, మరోవైపు నిండుకున్న జలాశయాలతో కృష్ణా డెల్టా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన వేళ పట్టిసీమ డెల్టా రైతాంగాన్ని ఆదుకోనుంది. పట్టిసీమ లిఫ్ట్ వద్ద గోదావరి ప్రవాహం మెరుగు పడటంతో నదీ జలాల తరలింపు ప్రారంభమైంది. బుధవారం ఉదయం లిఫ్ట్ మోటర్లకు పూజలు నిర్వహించి మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపు ప్రారంభించారు. మూడ్రోజుల్లో ప్రకాశం బ్యారేజీ ఎగువన ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో గోదావరి జలాలు కలువనున్నాయి. పట్టిసీమ నీటి విడుదల కృష్ణా రైతుల్లో ఉత్సాహాన్ని నింపింది.

పట్టిసీమతో పాటు గోదావరి డెల్టాలోని తాడిపూడి, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులకు నీటి పంపింగ్‌ను మంత్రి రామానాయుడు ప్రారంభించారు. 2014లో ప్రారంభమైన పోలవరం కుడికాల్వ పనుల్ని ఏడాదిలోపే పూర్తి చేవారు. 2015లో తొలిసారి నీటిని విడుదల చేశారు. తొలి ఏడాది 2015-16లొ 8.50టిఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించారు. 2016-17లో 55.60టిఎంసీలు, 2017-18లొ 105 టిఎంసిలను తరలించారు.

2018-19లో 26.88టిఎంసిలను తరలించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు పట్టిసీమ ప్రాజెక్టును వినియోగించలేదు. ఎగువ నుంచి నీటి ప్రవాహం ఉండటంతో పట్టిసీమను అందుబాటులో ఉన్నా వినియోగించలేదు. పులిచింతల వద్ద కృష్ణా జలాలను నిల్వ చేసి గోదావరి నీటిని వాడుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశారు. గత ఏడాది ఎగువ నుంచి నీటి విడుదల లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారు. 2023-24లో 33టిఎంసిలను విడుదల చేశారు.

గతేడాది ఆగస్టు 11న పట్టిసీమ ఎత్తిపోతలతో నీటి తరలింపు ప్రారంభించినా నెల రోజులకే నిలిపివేశారు. గోదావరిలో పుష్కలంగా జలాలు ఉన్నా.. డెల్టాకు అవసరం ఉన్నా.. పట్టిసీమను పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకో లేదు. నీటి తరలింపు ప్రారంభించడంతో గోదావరి జలాలు మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి జలాలు చేరనున్నాయి.

ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ అడుగంటి, పులి చింతల ఎండిన పరిస్థితుల్లో ఉంది. గోదావరిలో ప్రస్తుతం 26.72 అడుగుల స్థాయిలో వరద ప్రవాహం ఉంది. గోదావరిలో పట్టిసీమ వద్ద 14 అడుగులు ప్రవాహం చేరితో ఎత్తిపోత లకు నీరు అందుతుంది. పట్టిసీమ లిఫ్ట్‌ సామర్థ్యం 8500 క్యూసె క్కులు. బుధవారం మొదట వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా నీటి విడుదల పెంచుతారు.

కృష్ణా డెల్టాకు సాగు, తాగునీరు, నీటి ఆవిరితో కలిపి ఈ ఖరీఫ్ సీజన్‌లో 155.40 టీఎంసీలు కావాల్సి ఉంది. గత ఏడాది కృష్ణా డెల్టాకు 134.62 టీఎంసీలు విని యోగించారు. పులిచింతలలో ఉన్న మొత్తం నీటిని ఖాళీ చేశారు. ఇప్పుడు ఎగువున ఉన్న ప్రాజెక్టులన్నీ నిండితే తప్ప అది నిండే పరిస్థితి లేదు. గత ఏడాది మూసీ వరద రావడంతో 32. 67 టీఎంసీల నీరు అదనంగా వచ్చింది. వరదల వల్ల వచ్చిన జలాలను సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మధ్య నీటి నిల్వకు అవకాశం లేకపోవడంతో మొత్తం సముద్రంలోకి వెళ్లిపోతోంది.

Whats_app_banner