Kadapa: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొన్న కంటైనర్.. ఐదుగురు మృతి
Kadapa: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును కంటైనర్ బలంగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు.. కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు.
సోమవారం రాత్రి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. కడప వైపు నుంచి వస్తున్న కారును.. రాయచోటి నుంచి కడప వెళ్తున్న కంటైనర్ ఢీకొని లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
కడప జిల్లా కొడుగారిపల్లె గ్రామానికి చెందిన వల్లెపు చిన్నవెంకటమ్మ (50) భర్త.. ఇటీవలి మృతి చెందాడు. పెద్ద ఖర్మ కార్యక్రమం అనంతరం ఆమె తన పుట్టిల్లు గువ్వల చెరువుకు తన కోడలు పల్లెపు నాగలక్ష్మి (35), కుమారుడు బుద్దిగారి నాగయ్య (46), ఉప్పలవారిపల్లె గ్రామానికి చెందిన ఖాడుమియ్య (38)తో కలిసి కారులో సోమవారం బయలుదేరారు.
చక్రాయపేట నుంచి వేంపల్లి, ఎర్రగుంట, కడప మీదుగా గువ్వల చెరువుకు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్ రోడ్డులోని మూడో మలుపు వద్ద కారును ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొంది. అదుపుతప్పి కంటైనర్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ డ్రైవర్ మహబూబ్ షరీఫ్ (38) అక్కడికక్కడే మరణించాడు. కంటైనర్ క్లీనర్ పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. లోయలోకి దూపుకెళ్లిన కంటైనర్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్‌ను బయటకు తీశారు. క్లీనర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
కారు అదుపుతప్పి ముగ్గురు మృతి..
కడప జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు పాత బస్టాండు ప్రాంతంలో నివాసం ఉంటున్న భగత్ సింగ్ (34), నాగలక్ష్మి (55), కియాన్ సింగ్ (9 నెలలు).. సోమవారం పాప పుట్టువెంట్రుకల వేడుక నిమిత్తం కారులో తిరుమలకు వెళ్తున్నారు. కడప జిల్లా దువ్వూరు మండలం చితకుంట గ్రామం వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ కారులో ప్రయాణిస్తున్న యుగంధర, ఉమామహేశ్వరి, సాయి, కల్యాణ్ సింగ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగ్రాతులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి)