AP Cabinet Meet: జూన్ 24న ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం, 21న కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
AP Cabinet Meet: ఆంధ్రప్రదేశ్ తొలి క్యాబినెట్ సమావేశానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల24వ తేదీన క్యాబినెట్ తొలి భేటీ జరుగనుంది.
AP Cabinet Meet: ఆంధ్రప్రదేశ్ తొలి క్యాబినెట్ సమావేశాన్ని జూన్24న నిర్వహించనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని శాఖల అధిపతులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24న క్యాబినెట్ సమావేశం జరుగనుండటంతో ఈ నెల 21వ తేదీలోపు అన్ని శాఖల నుంచి అవసరమైన ప్రతిపాదనల్ని నిర్దేశిత ఫార్మట్‌లో అందచేయాలని సిఎస్ సూచించారు.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో ఎన్నికైన శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 21వ తేదీన కొత్త సభ్యులు ప్రమాణం చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. 21వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు.
24వ తేదీన జరిగే తొలి క్యాబినెట్ భేటీలో ఎన్నికల హామీలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సచివాలయానికి వచ్చిన సిఎం చంద్రబాబు ఐదు కీలక హామీలపై సంతకాలు చేశారు. ఈ నిర్ణయాలకు క్యాబినెట్ అమోద ముద్ర వేయాల్సి ఉంది.
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు నిర్ణయంతో పాటు సూపర్ సిక్స్ ఎన్నికల హామీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీలో పెన్షన్ల పెంపు నిర్ణయం, డిఎస్సీ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలకు క్యాబినెట్ అమోదం తెలపాల్సి ఉంది. వాలంటీర్ వ్యవస్థపై విధివిధానాల ఖరారు, వేతనాల పెంపు వంటి అంశాలు కూడా చర్చించనున్నారు. దీంతో పాటు పోలవరం నిర్మాణంపై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.