AP Crime Updates: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కడపలో తండ్రితో మాట్లాడినందుకు కూతురికి వాతలు పెట్టిన తల్లి
AP Crime Updates: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో ఘటనలో తండ్రితో మాట్లాడినందుకు కుమార్తెకు వాతలు పెట్టిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
AP Crime Updates: శ్రీకాకుళంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వదిన, మరిది అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. ప్రమాద ఘటన మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలోని జాతీయ రహదారి ప్లైఓవర్‌పై చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కుడమసాయి గ్రామానికి చెందిన సవర వెంకటేష్ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా తణుకులోని ఒక హోటల్‌లో పని చేస్తున్నారు.
వ్యవసాయ పనుల సీజన్ కావడంతో స్వగ్రామం కుడమసాయిలో తమకున్న కొద్ది భూమిలో వ్యవసాయ పనులు చేయించేందుకు సవర వెంకటేష్ భార్య సవర అరియాని (27), వెంకటేష్ తమ్ముడు సవర జీవన్ కుమార్ (27) మంగళవారం మధ్యాహ్నం తణుకు నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రాత్రి 8.30-9 గంటల మధ్య రణస్థలం మండలం పైడి భీమవరం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
అతి వేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న జీవన్ కుమార్ పైడిభీమవరం సమీపంలోని జాతీయ రహదారిపై తమకు ముందు వెళ్తున్న లారీని క్రాస్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో వీరి ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వెనక కూర్చొన్న వదిన అరియాని రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందింది. జీవన్ కుమార్ మరో 20 మీటర్లు ముందుకు వెళ్లి అక్కడ వంతెన గోడను ఢీకొన్నాడు. దీంతో అక్కడ నుంచి 30 అడుగుల కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడి మరణించాడు.
ప్రమాదం జరిగిన రోడ్డుకు ఇరువైపు విద్యుత్తు లైట్లు కూడా లేవు. చీకటిలోనే ద్విచక్ర వాహనం అతివేగంతో నడపడంతోనే అదపుతప్పి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అరియాని, జీవన్ కుమార్ మృతదేహాలను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనం అతి వేగంతో నడపడం, అలాగే జాతీయ రహదారికి ఇరువైపు విద్యుత్తు దీపాలు కూడా లేకపోవడం ప్రమాదం జరగడానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతిరాలు అరియానికి భర్తతో పాటు ఐదేళ్ల కుమార్తె ఉంది. మృతుడు జీవన్ కుమార్‌కు ఇంకా వివాహం జరగలేదు.
కడప జిల్లాలో అమానవీయం...
తండ్రితో మాట్లాడినందుకు కుమార్తెపై కన్నతల్లి దాడి చేసిన ఘటన కడపలో జరిగింది. ఈ ఘటనపై తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.కన్న తండ్రితో మాట్లాడినందుకు కుమార్తెపైనే కన్న తల్లి దాడికి పాల్పడింది. కుమార్తెపై కన్నతల్లి అమానవీయంగా వ్యవహరించింది. గరిటెను కాల్చి కుమార్తె లేలేత శరీరంపై వాతలు పెట్టింది. ఈ ఘటనపై కన్న తల్లిపైన పోలీసులు కేసు నమోదు చేశారు.
కడప జిల్లా సింహాద్రిపురం మండలం రావులకోలనులో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య, భర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే వీరి కుమార్తె (14) తల్లి సంరక్షణలో ఉంటోంది.
తల్లికి తెలియకుండా అప్పుడప్పుడు తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతుంది. తండ్రి ఆరోగ్యం, అలాగే కుటుంబ విషయాలు మాట్లాడేది. అయితే ఈనెల 28న తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుమార్తె తండ్రికి ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లమని సలహా ఇచ్చింది. తండ్రి ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు కుమార్తెకు వివరించాడు.
తండ్రితో కుమార్తె ఫోన్‌లో మాట్లాడే విషయంలో తల్లికి తెలిసింది. దీంతో కోపోద్రికురాలైన తల్లి కుమార్తెను కొట్టింది. ఆ చిన్నారి ఏడుస్తున్నా ఏకంగా గరిటె తీసి దాన్ని బాగా కాల్చి కుమార్తె చేతులపై వాతలు పెట్టింది. దీంతో కుమార్తె కేకలు పెడుతూ ఏడ్చింది. వెంటనే చుట్టుపక్కలవారు ఏం జరుగుతోందోనని అక్కడికి చేరుకున్నారు.
తల్లి చేసిన ఘనకార్యాన్ని చూసి బాలికను చికిత్స కోసం పులివెందుల ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల స్థానికులు తల్లిని మందలించారు. తనతో మాట్లాడినందుకు కుమార్తెపై భార్య దాడి చేసిన విషయం తెలుసుకున్న భర్త, ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించాడు. చికిత్స అనంతరం మంగళవారం పోలీస్ స్టేషన్‌కు కుమార్తెను తీసుకొని వెళ్లి తల్లిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తల్లిపై కేసు నమోదు చేసి, తల్లిని అదుపులోకి తీసుకున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)