AP CEO Alert : వాలంటీర్ల వీడియో, ఫొటోలను వాట్సాప్ చేయాలంటూ ప్రచారం ... ఖండించిన ఈసీ
AP Election Commission : వాలంటీర్లకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఓ వార్తపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది. ప్రచారం అవుతున్న వార్త ఫేక్ అని పేర్కొంది.
AP Election Commission News: ఏపీ ఎన్నికల(AP Elections 2024) వేళ వాలంటీర్ల విధులకు సంబంధించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిని విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో వీరు ఎన్నికల ప్రక్రియలో భాగం కావటం లేదు. అయితే ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో… పలు తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వాలంటీర్లకు సంబంధించి మరో తప్పుడు పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కాస్త ఏపీ ఎన్నికల సంఘం(AP Election Commission) దృష్టి వరకు చేరింది. దీనిపై స్పందిస్తూ…. ప్రకటన చేసింది ఈసీ.
సోషల్ మీడియాలో వైరల్…
" ఎలక్షన్ కమిషన్ నిర్ణయం.. రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లు ఎవరైనా మీ కంటపడితే వెంటనే ఫొటో కానీ వీడియో కానీ తీసి వాలంటీర్ పేరు,, ఊరు పేరును ఏపీ సీఈవోకి వాట్సాప్ చేయాలంటూ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఓ ఫొన్ నెంబర్ ను కూడా పేర్కొన్నారు. ఈ పోస్ట్ విషయంలో ఏపీ ఎన్నికల సంఘం వరకు చేరటంతో.. ఈసీ స్పందించింది. ఫేక్ న్యూస్ అని పేర్కొంది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించింది.
ఇక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావటంతో… ఏపీ ఎన్నికల సంఘం ఇప్పటికే కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ భవనాలపై రాజకీయ నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఇటీవలే సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారం చేయకూడదన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తున్నాయన్నారు. సి-విజిల్ యాప్(Cvigil App) ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 385 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం 173 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
వాలంటీర్లు, ఉద్యోగులు స్వయంగా వెళ్లి ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఈవో స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎవరు కూడా ప్రచారాలు, సభలు నిర్వహించకూడదని తెలిపారు. సువిధ యాప్(Suvidha App) ద్వారా సభలు, ప్రచారానికి అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు (Govt Employees)ఎట్టి పరిస్థితుల్లో ప్రచారాల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఉన్నాయన్నారు.