Change In CM Jagan: జగన్ తీరులో మార్పు వచ్చినట్టేనా?
Change In CM Jagan: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితమో మరో కారణమో తెలియదు కానీ మిగ్‌జాం తుఫానుతో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు 48గంటల్లోనే సిద్ధమవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Change In CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరులో అనూహ్యంగా మార్పు వచ్చింది. తెలంగాణలో వెలువడిన ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్‌తోనో, మరో కారణమో స్పష్టంగా తెలియకున్నా ఆయన తాడేపల్లిని వీడి జనంలోకి బయల్దారు.
మిగ్‌జామ్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కనీవిని ఎరుగని స్థాయిలో నష్టం జరిగింది. దక్షిణ కోస్తా జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. తిరుపతి, నెల్లూరు,గుంటూరు , ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనాల్లో దాదాపు లక్షన్నర ఎకరాల్లో వరి మరో 50వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
తుపాను గత మంగళవారం మధ్యాహ్నం తీరం దాటినా బుధ,గురు వారాల్లో కూడా వర్షాలు కొనసాగాయి. తుఫాను ప్రభావంపై ఇప్పటికే వ్యవసాయ, రెవిన్యూ శాఖల అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. దాదాపు రూ.490కోట్ల రుపాయల సాయం విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
జనంలోకి వైఎస్ జగన్...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పర్యటనల విషయంలో భిన్నమైన వైఖరి అవలంబించారు. ప్రకృతి విపత్తులు, వరదలు సంభవించినపుడు సహాయక చర్యలకు ముఖ్యమంత్రి పర్యటనలు అటంకం కలిగిస్తాయని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ శాఖలను ముందుండి నడిపించాలని సహాయక చర్యలకు అడ్డంకి కాకూడదని చెప్పే వారు. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో మాత్రమే ఆయన వేగంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పాపికొండల బోటు ప్రమాదాన్ని పరిశీలించారు. మిగిలిన ఘటనల్లో వారం పది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టిన తర్వాతే బాధితుల్ని పరామర్శించేవారు.
ఈ సారి మాత్రం తుఫాను తీరం దాటిన 48గంటల్లోనే ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి పర్యటనకు బయల్దేరారు. శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు.
అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్న సీఎం జగన్.. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సీఎం సమావేశం కానున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి గ్రామస్ధులు, తుపాను బాధితులతో నేరుగా సమావేశమవుతారు, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుంటారు.
అక్కడ తుపాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులతో మాట్లాడతారు, అక్కడి నుంచి బుద్దాం చేరుకుని తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు, ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
మరోవైపు నేడు టీడీపీ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు కూడా తుఫాను బాధితులను పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. ఒకే రోజు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు వేర్వేరుగా బాధితుల్ని పరామర్శించేందుకు రెడీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఖరిలో అనూహ్య మార్పు కారణమేమిటనే ఆసక్తి మాత్రం అందరిలో ఉంది.