DurgaDevi: దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపం దుర్గాదేవి... అష్టమి రోజు అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
DurgaDevi: దసరాశరన్నవరాత్రుల్లో భాగంగా 8వ రోజైన నిజ ఆశ్వయుజ శుద్ధ అష్టమి సందర్భంగా గురువారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులను సాక్షాత్కారిస్తున్నారు.
DurgaDevi: దుర్గముడనే రాక్షసుడిని సంహరించినందున దుర్గ అని అమ్మవారికి పేరొచ్చింది. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా భక్తులు దుర్గాదేవిని కొలుస్తారు. ఎరుపు రంగు చీరలో త్రిశూలం చేతపట్టి కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఈ అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే శత్రు బాధలు నశిస్తాయని ప్రతీతి. దేవీ శరన్నవరాత్రుల్లో ఎనిమిదో రోజు ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వసచ్చారు. అష్టమి రోజు దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన గారెలు, కదంబం (కూరగాయలు, అన్నం కలిపి వండేది), బెల్లం, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున భక్తులు దుర్గాష్టమిగా కూడా జరుపుకుంటారు.
దుర్గాష్టమి సందర్భంగా
"మాతర్మే మదుకైటభఘ్ని మహిషప్రాణాపహారోద్యమే
హేలనిర్మిత ధూమ్రలోచన వధే హేచండముండార్ధిని
నిశేషీకృత రక్తబీజ దనుజే నిత్యే: నిశుంభావహే
శుంభధ్వంసిని సంహారాశు దురితం దుర్గే - నమస్తే అంబికే" అంటూ ఈ రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
చారిత్రక నేపథ్యం…
పూర్వం మాధవవర్మ అనే రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు విజయవాటికాపురిలో (విజయవాడ) కనకవర్షం కురిపించిందని అప్పటి నుంచి అమ్మవారు కనకదుర్గగా కొలవబడుతుందని భక్తుల నమ్మకం. దసరా మహోత్సవాలలో స్వర్ణ కవచాలంకృత కనక దుర్గాదేవి అమ్మవారిని అలంకరిస్తారు. ఆ తల్లిని దర్శించుకుంటే సకల దారిద్ర్యాలు నశించి భక్తులకు రక్షణ లభిస్తుంది. కనకదుర్గ అలంకారంలో అమ్మవారి దర్శనం శుభకరం, ఐశ్యర్యప్రదాయకమని నమ్ముతారు.
దుర్గుణాలను పోగొట్టి కొలిస్తే కోరిన శుభాలనొసగే కరుణామయిగా అఖిలాండకోటి బ్రహ్మాండనాయకిగా కనకదుర్గమ్మ పేరును సంపాదించింది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మవారు కోట్లాది మంది భక్తులకు ఇలవేల్పు. నవరాత్రుల వేళ కరుణించవమ్మా.. కనకదుర్గమ్మా .. జై భవానీ.. జైజై భవానీ నామస్మరణతో వేడుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలి వస్తున్నారు.
దసరా శరన్నవరాత్రుల్లో రోజుకో రూపంలో దర్శనమిచ్చే ఆదిపరాశక్తిని పూజిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పది రోజుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు రావొచ్చని భావిస్తున్నారు.
ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, అష్టమి గడియాల్లో గురువారం తెల్లవారు జామున మూడు గంటలకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల అర్చన, బాలబోగ నివేదన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన అవకాశం కల్పించారు. చతుర్వేద పారాయణలు, మహావిద్య, సుందరకాండ, సప్తశతి, చండీనవాక్షరి, బాలమంత్రం, సూర్య నమస్కారాలు, లక్ష్మీగణపతి, శివపంచాక్షరీ, నవగ్రహ జపం, లలితా సహస్రనామ పారాణాయాలతో పాటు ప్రతిరోజు కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు.sa