Deputy CM Pawan : ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోండి - డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు-deputy cm pawan kalyan ordered the officials to apprehend the criminal masterminds behind the smuggling of red sanders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Deputy Cm Pawan : ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోండి - డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు

Deputy CM Pawan : ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక ఉన్న పెద్ద తలకాయల్ని పట్టుకోండి - డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 06, 2024 07:25 AM IST

Deputy CM Pawan Kalyan Review : ఎర్ర చందనం అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని అటవీ శాఖ అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. శేషాచలం అడవుల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.

అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
అటవీ శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష

ఎర్ర చందనం అక్రమ రవాణా వెనక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వైఎస్సార్‌ కడప జిల్లా అటవీ శాఖాధికారులతో సమీక్షించిన ఆయన… శేషాచలంలో కొట్టేసిన దుంగలను ఎక్కడెక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలన్నారు. జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోతోందని… నిఘా వ్యవస్థలను పటిష్టపరచాలని దిశానిర్దేశం చేశారు.

yearly horoscope entry point

ఇటీవల వై.ఎస్.ఆర్. కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్ర చందనం డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. ఈ డంప్ లో 158 ఎర్ర చందనం దుంగలు దొరికాయనీ, వీటి విలువ రూ.1.6 కోట్లు అని నివేదికలో పేర్కొన్నారు.

అత్యంత విలువైన ఎర్ర చందనాన్ని అడ్డగోలుగా నరికేసి జిల్లాలు, రాష్ట్రాలు దాటించి విదేశాలకు అక్రమంగా తరలించేస్తున్నారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ … నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు. అక్రమ రవాణా చేస్తున్నవారిని అరెస్టు చేయడంతో పాటు వాళ్ళ వెనక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ దందాపై డిప్యూటీ సీఎం పవన్ స్పందిస్తూ.... శేషాచలం అడవుల్లో భారీగా ఎర్ర చందనం వృక్షాలను నరికేశారని అన్నారు. ఆ దుంగలను ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించాలని స్పష్టం చేశారు. ఎర్ర చందనం స్మగ్లర్ల నెట్వర్క్ ను నడిపిస్తున్న కింగ్ పిన్స్ ను పట్టుకోవాలన్నారు. నరికివేత కూలీలు, రవాణాదారులను తెర వెనక ఉండి నడిపిస్తున్నవాళ్లను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. అలాంటి కింగ్ పిన్స్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసులు పకడ్బందీగా నమోదు చేయాలన్నారు.

గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయట తిరుగుతున్నవారిపై నిఘా పెట్టాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. వారి కార్యకలాపాలతో పాటు వాళ్ళకు ఎవరెవరితో లావాదేవీలు నడుస్తున్నాయి వంటి అంశాలపై నిఘా ఉంచాలన్నారు. ఆ దిశగా అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

కేసుల వివరాలపై ఆరా….

ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటి వరకూ నమోదైన కేసుల వివరాలపై పవన్ కల్యాణ్ ఆరా తీశారు. నమోదైన వాటిలో ఎన్ని కేసుల్లో శిక్షలుపడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కేసులు వీగిపోతే అందుకుగల కారణాలను పేర్కొనాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్ దేశంలో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్ర చందనం దుంగలను తిరిగి తెచ్చుకోవడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Whats_app_banner