Machilipatnam Port: మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన సిఎం జగన్మోహన్ రెడ్డి-cm jaganmohan reddy laid the foundation stone of machilipatnam port ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Machilipatnam Port: మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన సిఎం జగన్మోహన్ రెడ్డి

Machilipatnam Port: మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన సిఎం జగన్మోహన్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
May 22, 2023 11:10 AM IST

Machilipatnam Port: కృష్ణాజిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేలా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తొలిదశలో నాలుగు బెర్తులతో 30నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపనలో భాగంగా గంగమ్మకు సిఎం పూజలు నిర్వహించారు.

మచిలీపట్నం పోర్టు నమూనా పరిశీలిస్తున్న సిఎం జగన్
మచిలీపట్నం పోర్టు నమూనా పరిశీలిస్తున్న సిఎం జగన్

Machilipatnam Port: మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పోర్టు నిర్మాణంతో జిలా ముఖచిత్రం మారిపోతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పోర్టు నిర్మాణ ప్రదేశంలో భూమి పూజచేసి పైలాన్‌ను ఆవిష్కరించారు

35.12 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్‌ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీపర్పస్‌-కంటైనర్‌తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో మచిలీపట్నం పోర్టును 24-30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.

పోర్టు పనులు పూర్తయితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి లభించనుంది. వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేకొద్దీ 16 బెర్తులతో 116 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

మచిలీపట్నం పోర్టు ద్వారా రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు ఎరువులు, బొగ్గు, వంటనూనె, కంటైనర్ల దిగుమతులు, వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, సిమెంట్‌ క్లింకర్, గ్రానైట్, ముడి ఇనుము ఎగుమతులకు వేదికగా మారుతుందన్నారు.

సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, మూలపేట పోర్టుల నిర్మాణాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 75 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు.

పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ. 5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మచిలీపట్నం పోర్టు కు ఇప్పటికే భూసేకరణ చేసి, అన్ని అనుమతులు సాధించి, న్యాయ వివాదాలు పరిష్కరించి, టెండర్లు ఫైనలైజ్‌ చేసి, ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తి చేసి పోర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళలో కేవలం 6 పోర్టులు కడితే, ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ అధికారంలోకి వచ్చిన కేవలం 4 ఏళ్ళలోపే 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు సిఎం వివరించారు.

ఇప్పటికే రామాయపట్నంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయని, మూలపేట పోర్టు పనులు కూడా ఇప్పటికే ప్రారంభించామని, కాకినాడ గేట్‌ వే పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయని, బందరు ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ మచిలీపట్నం పోర్టు పనుల్ని ప్రారంభింస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పోర్టు నిర్మాణానికి 4 ఫిబ్రవరి 2020న మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో ప్రత్యేక సంస్ధ ఏర్పాటు, రూ. 5,156 కోట్లతో పోర్టు నిర్మాణానికి పరిపాలన అనుమతుల మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. 28 ఫిబ్రవరి 2023న పోర్టు నిర్మాణానికి కీలకమైన పర్యావరణ అనుమతులు, 13 ఏప్రిల్‌ 2023న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు మంజూరు, 2023 మార్చి నెలలో 1,923 ఎకరాల భూసేకరణ పూర్తైనట్లు వివరించారు.

 

Whats_app_banner