Jagan Challenge : 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం ఉందా.. ? చంద్రబాబు, పవన్ కి సీఎం జగన్ సవాల్
Jagan Challenge : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలిచి తీరుతుందని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. మంచి చేశాం కాబట్టే ఆ మాట చెప్పే ధైర్యం మాకుందని అన్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అని టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకి సవాల్ విసిరారు. తెనాలి మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్... బటన్ నొక్కి వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరవుకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.. సీఎం జగన్.
Jagan Challenge : టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకి... సీఎం జగన్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175కి.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా అని ఛాలెంజ్ చేశారు. ప్రజలకు వాళ్లు ఎప్పుడూ మంచి చేయలేదు కాబట్టే.. ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గజదొంగల ముఠా తయారైందని.. దోచుకో.. దాచుకో.. తినుకో అనేదే వారి విధానమని జగన్ విమర్శించారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని దుష్టచతుష్టయానికి దత్తపుత్రుడు జతకలిశాడని సెటైర్ వేశారు. చేసిన మంచి చెప్పుకొని మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. 175కి.. 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని... మీ ఇంట్లో మంచి జరిగిందో లేదా చూసుకోవాలని.. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలవాలని కోరారు. తెనాలి మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్... బటన్ నొక్కి వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ మూడో విడత నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.
మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ సాయం పంపిణీలో భాగంగా.. 51,12,453 మంది రైతులకి రూ. 1,090.76 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాల్లో జమ చేశారు. అలాగే... గతేడాది మాండమస్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు రూ.76.99 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేసింది. పెట్టుబడి సాయంతో పాటే పంట నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. 91,237 మంది రైతులు ఇన్ పుట్ సబ్సిడీ అందుకున్నారు. వైఎస్సార్ రైతుభరోసా స్కీమ్ ద్వారా... రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఏటా రూ. 13,500 పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడని... రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. వరుసగా నాలుగో ఏడాది మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నామని.. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయన్న జగన్... ప్రతి చెరువు, రిజర్వాయర్ నిండాయని ఆనందం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఎక్కడా కరవు అనే మాటే లేదని.. భూగర్భ జలాలు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఆహార ధాన్యాల దిగుబడి సగటున 166 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరుగుతోందని... ధాన్యం సేకరణ కోసం ఇప్పటి వరకు రూ.55 వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని వివరించారు.
రైతు భరోసా ద్వారా నాలుగేళ్లలో రూ. 27 వేల కోట్లు అందజేశామన్నారు సీఎం జగన్. నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ. 54 వేల చొప్పున సాయం అందించామని వివరించారు. ఆర్బీకేల ద్వారా రైతన్నలకు విత్తనం నుంచి ఎరువుల వరకు తోడుగా నిలిచామని.. మన ఆర్బీకేలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని చెప్పుకొచ్చారు. రైతుకి ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలుస్తున్నామన్నారు. సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు రూ. 1,834 కోట్లు చెల్లించామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.384 కోట్ల విత్తన... రూ. 960 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించామన్నారు. రైతన్నల కోసం నాలుగేళ్లలో అనేక కార్యక్రమాల ద్వారా రూ. లక్షా 45 వేల కోట్లు చెల్లించామన్నారు ముఖ్యమంత్రి.
చంద్రబాబు పాలనలో ప్రతి ఏటా కరవే అని... కరవుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని జగన్ ఎద్దేవా చేశారు. టీడీపీ పరిపాలనలో ఏటా కరవు మండలాల ప్రకటన ఉండేదని ... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రాష్ట్రాని కరవు వచ్చేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కరవుతో స్నేహం చేసిన చంద్రబాబుకు.. మీ బిడ్డకు మధ్య యుద్దం జరగబోతోందని వ్యాఖ్యానించారు.
అంతకముందు... వైఎస్ఆర్ రైతు భోరసాపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.