Jagan on CBN: చంద్రబాబు జైల్లో ఉన్నా, జనంలో ఉన్నా తేడా లేదు, అరెస్ట్ వెనుక కక్ష సాధింపు లేదన్న జగన్
Jagan on CBN: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నా, జనంలో ఉన్నా పెద్దగా తేడా ఏమి ఉండదని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. విజయవాడలో నిర్వహించిన వైసీపీ ప్రజాప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు, పవన్‌లపై విమర్శలు గుప్పించారు.
Jagan on CBN: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమి ఉండదని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, బాబు ఎక్కడ ఉన్నా ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. అలాంటి బాబు ఎక్కడున్నా ఒక్కటేనన్నారు.
చంద్రబాబును చూసినప్పుడు, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకు వచ్చేది ఒక్కటేనని.. మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలు మాత్రమే గుర్తుకు వస్తాయన్నారు.
వైసీపీని చూసినప్పుడు, జగన్‌ను చూసినప్పుడు సామాజిక న్యాయం గుర్తుకు వస్తుందన్నారు. గ్రామాల్లో మారిన వైద్యం, స్కూళ్లు, వ్యవసాయం, ప్రాంతాల మధ్య న్యాయం, లంచాలు, వివక్షలేని వ్యవస్థలు గుర్తుకు వస్తాయన్నారు. ఫోన్ పెట్టుకుని ధైర్యంగా అక్క చెల్లెమ్మలు బయటకు వెళ్లే పరిస్థితి గుర్తుకు వస్తుందని చెప్పారు. చంద్రబాబును కక్షతో అరెస్ట్ చెయ్యలేదని జగన్ ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు తాను ఇండియాలో లేనని చెప్పారు.
చంద్రబాబునాయుడిని ఎవరు కక్షసాధింపుతో అరెస్టు చేయ లేదని, బాబు మీద ఎలాంటి కక్ష లేదని జగన్ స్పష్టం చేవారు. కక్షసాధించి ఆయన్ని ఎవరు అరెస్ట్ చేయలేదన్నారు.
తాను భారతదేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని, కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు, సగం టీడీపీ నాయకులు బీజేపీలోనే ఉన్నారని వివరణ ఇచ్చారు. కేంద్రంలోని ఇన్‌కంటాక్స్, ఈడీ విచారణ చేసి ఆయన అవినీతిని నిరూపించాయని, దోషులను అరెస్టు చేశారని చెప్పారు.
బాబుకు ఇన్‌కం ట్యాక్స్ నోటీసులు కూడా ఇచ్చారని, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మోడీ, బాబుపై అవినీతి ఆరోపణలు కూడా చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీబీఐని, ఐటీని, ఈడీని అడుగు పెట్టనివ్వనని గతంలో చంద్రబాబు పర్మిషన్ కూడా విత్‌డ్రా చేశాడని చెప్పారు.
అప్పటికే అవినీతి పరుడని స్పష్టంగా రూఢి అయిన ఈ వ్యక్తిపైన విచారణ చేయకూడదని జగన్ మండిపడ్డారు. విచారించిన తర్వాత రిమాండుకు పంపినా, చంద్రబాబును, వీరప్పన్‌ను ఎవ్వరూ పట్టించి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లోమీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయన్నారు.
బాబును సమర్థించామంటే, రాష్ట్రంలో పేద సామాజిక వర్గాలన్నింటినీ వ్యతిరేకించడమే అన్నారు. చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండటమేనని, చంద్రబాబును సమర్థించడమంటే..పెత్తందారి వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమే అన్నారు. చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లిషు మీడియం అందకుండా వ్యతికేకించడమేనని, చంద్రబాబును సమర్థించడమంటే..డెమోగ్రాఫిక్ ఇన్ బ్యాలెన్స్ అంటూ ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలను వ్యతిరేకించడమే అన్నారు.చంద్రబాబును సమర్థించడమంటే.. కొన్ని వర్గాలు ఎప్పటికీ పేదలుగా, కూలీలుగా మిగిలి పోవాలని సమర్థించినట్టే అన్నారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తు ప్రజలతోనేనని, పొత్తుల మీద ఆధారపడనని, దేవుడ్ని, తర్వాత ప్రజలనే నమ్ముకుంటానని జగన్ ప్రకటించారు. కాబట్టే పొత్తు ప్రజలతోనే నేరుగా ఉంటుందని, దేవుడి దయతో ప్రజలకు చేసిన మంచే మన ధైర్యం, మన ఆత్మవిశ్వాసం అని చెప్పారు.
ప్రతిపక్షాలు అన్నీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని, వారు ఎంతమంది కలిసినా… రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా.. సున్నాయేనని. ఎన్ని సున్నాలు కలిసిన వచ్చేది పెద్ద సున్నాయేనన్నారు.
బాబును మోయడమే వారి పని..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు జగన్ చురకలు వేశారు. ఒకరికి ప్రతి నియోజక వర్గానికి అభ్యర్థి కూడా లేడని, ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్త లేరని, చంద్రబాబును మోయడమే ఆయన పని అన్నారు. చంద్రబాబు దోచుకున్న దాంట్లో పార్టనర్ అని, మోసాలు చేయడంలో పార్టనర్ అని ఆరోపించారు. బిస్కట్ వేసినట్టు, చాక్లెట్ వేసినట్టు సంపాదించిన సొమ్ములో భాగం పంచడం అలవాటన్నారు.
అబద్ధాలు నమ్మొద్దరని… మోసాలు నమ్మొద్దని మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే.. దాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవాలని కోరారు. అందుకే వై నాట్ 175 పిలుపుతోనే అడుగులు ముందుకేస్తున్నట్లు ప్రకటించారు.