AP Assembly : ఏపీ అప్పు 10 లక్షల కోట్లు..! రాష్ట్ర విభజన కంటే జగన్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువ - సీఎం చంద్రబాబు-cm chandrababu released a white paper in the ap assembly on the economic situation of the state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Assembly : ఏపీ అప్పు 10 లక్షల కోట్లు..! రాష్ట్ర విభజన కంటే జగన్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువ - సీఎం చంద్రబాబు

AP Assembly : ఏపీ అప్పు 10 లక్షల కోట్లు..! రాష్ట్ర విభజన కంటే జగన్ వల్ల జరిగిన నష్టమే ఎక్కువ - సీఎం చంద్రబాబు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 26, 2024 02:23 PM IST

AP Assembly Session Updates 2024: ఏపీ ఆర్థిక పరిస్థితులపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రూ.76 వేల కోట్ల ఆదాయం దెబ్బతినే విధంగా.. జగన్ రెడ్డి అసమర్ధ పాలన కొనసాగిందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సభలో వీడియోల ద్వారా లెక్కలను వివరించారు.

శాసనసభలో సీఎం చంద్రబాబు
శాసనసభలో సీఎం చంద్రబాబు

White Paper On AP Financial Status : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు… తాము రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త పోర్టులు ప్రారంభించామని గుర్తు చేశారు. కానీ పాలసీ మార్చి తమకు కావాలసిన వారికి వైసీపీ ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. ఇప్పుడు ఇవి చాలా ఆలస్యం అయ్యాయని తెలిపారు. వైసీపీ పాలన కారణంగా… రాష్ట్రానికి రూ.76,795 కోట్ల ఆదాయం తగ్గిందని చెప్పుకొచ్చారు.

అమరావతి అభివృద్ధి కొనసాగి ఉంటే 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధి చెంది ఉంటే రూ.3లక్షల కోట్ల ఆస్తి వచ్చేదని పేర్కొన్నారు.

విభజన తరువాత, అధికారం చేపట్టి 2014-2019 మధ్య అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టటమన్నారు చంద్రబాబు. పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితికి తీసుకుని వచ్చామని గుర్తు చేశారు.

“2019లో రాష్ట్రం ఒక అసమర్ధుడి చేతిలోకి వెళ్ళింది. 2014-2019తో పోల్చుకుంటే, 2019- 2024 మధ్య వ్యవసాయంలో 5.7% గ్రోత్ రేట్ తగ్గిపోయింది. సర్వీస్ సెక్టార్ 2% గ్రోత్ రేట్ తగ్గిపోయింది. ఓవరాల్ గ్రోత్ రేట్ 3% తగ్గిపోయింది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

కేవలం అసమర్ధ, తుగ్లక్ నిర్ణయాలు, అవినీతితో… గత 5 ఏళ్ళలో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందన్నారు చంద్రబాబు. రూ.76 వేల కోట్ల ఆదాయం దెబ్బతినే విధంగా.. గత జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్ధ పాలన కొనసాగిందని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి చేసిన ఘనకార్యంతో తలసరి ఆదాయం తగ్గి, తలసరి అప్పు రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు.

“ప్రజలపై రకరకాల పన్నులు వేసి, ఆ మొత్తం జేబులో వేసుకుని, మళ్ళీ అప్పులు చేశారు. ఆర్ధిక విధ్వంసం చేసారు. ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆర్ధిక విధ్వంసానికి ఒక ఉదాహరణ. 33 సంస్థల నుంచి.. వాళ్ళు దాచుకున్న డబ్బులు, రూపాయి లేకుండా మొత్తం లాగేసారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో రూ.1.35 లక్షల కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. మొత్తం బాకీలు పెట్టి… దోచుకుని, జగన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఈ భారం మొత్తం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై పడింది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో వివరించారు.

పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుందని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయంలో పట్టిసీమ పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లు కూడా టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేవని వ్యాఖ్యానించారు. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఏపీని మార్చామని… కానీ వైసీపీ పాలనలో ఎలాంటి పెట్టుబడులు లేకుండా పోయాయని దుయ్యబట్టారు.

జగన్ రెడ్డి పాలన ఎంత అధ్వానం అంటే.. భవిష్యత్తులో 15 ఏళ్ళ పాటు వచ్చే మద్యం ఆదాయం చూపించారు.వాటిపై అప్పులు తెచ్చుకున్నాడు. విభజన వల్ల జరిగిన నష్టం కన్నా.. జగన్ వల్ల జరిగిన నష్టమే రాష్ట్రానికి ఎక్కువ. జూన్, 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు రూ.9,74,556 కోట్లు( దాదాపు పది లక్షల కోట్లు). వీటిలో ఇంకా కార్పోరేషన్ రుణాలు, ఇతర శాఖల నుంచి రావలిసిన సమాచారం ఇంకా ఉంది” అని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Whats_app_banner